21, డిసెంబర్ 2020, సోమవారం

శ్రీకాళహస్తిమాహాత్మ్యంలో శివస్తుతి హరిగతిరగడ

హరిగతి రగడలో పాదానికి ఎనిమిది చతుర్మాత్రాగణాలు. పాదం‌ మధ్యలో యతిమైత్రిస్థానం. అనగా నాలుగుగణాల పిదప ఐదవగణం‌ మొదటి అక్షరం మీద యతిమైత్రి చేయాలి. ప్రాస నియమం ఉంది. సంప్రదాయం ప్రకారం ప్రాసనియమం ఉన్నపద్యాల్లో ప్రాసయతి వేయకూడదు.

పాదాంతవిరామం తప్పనిసరిగా పాటించాలి.

హరిగతిరగడకు చతుర్మాత్రాగణాలు అని చెప్పాను కదా. చతుర్మాత్రా గణాలను లెక్క వేదాం. అన్నీ‌ లఘువులతో తొలి చతుర్మాత్రాగణం I I I I అవుతున్నది. ఒక గురువును వాడవచ్చును అనుకుంటే అప్పుడు ఏర్పడే చతుర్మాత్రాగణాలు [U I I,  I U I, I I U ] అని మూడు సిధ్ధిస్తున్నాయి. రెండు గురువులను వాడచ్చును అనుకుంటే చతుర్మాత్రాగణం U U అవుతున్నది. I U అన్న క్రమాన్ని ఎదురునడక అంటారు. దేశిఛందస్సుల్లో ఎదురునడకని సాధారణంగా అంటరానిదిగా చూస్తారు. I U I కూడా ఎదురునడకే కాబట్టి అది చతుర్మాత్రా గణంగా వాడరు అన్నది కూడా గమనించాలి. ఎదురునడక నిషిధ్ధం కాబట్టి I U I గణాన్ని మనం వాడకూడదు. ఐతే కొందరు పూర్వ కవులు ఈ‌  I U I గణాన్ని వాడారు.

రగడల్లో మొదట్లో ప్రాసనియమం కాని అంత్యప్రాసలను కూర్చటం‌ కాని లేదు. కాలక్రమేణ ఇది ఒక పద్దతిగా రూపుదిద్దుకుంది. అలాగే కొందరు పూర్వకవులు తమతమ రగడల్లో ఎదురునడకనూ వాడారు కాని చాలా అరుదు.

మరొక ముఖ్యవిషయం. తెలుగు ఛందస్సుల్లో గణాల దగ్గర పదం విరుగుతూ ఉంటే బాగుంటుంది. అలాగని ప్రతి గణమూ ఒక కొత్తమాటతో ప్రారంభం అయ్యేలా చూడటం దుస్సాధ్యం. కాని వీలైనంత వరకూ ఇది ఒక నియమంలా పాటించాలి. రగడలనే కాదు కందంతో‌ అన్ని రకాల దేశిఛందస్సుల్లోనూ ఇది శ్రధ్దగా పాటిస్తే పద్యాల్లో పఠనీయత పెరుగుతుంది. దేశి ఛందస్సుల ముఖ్యలక్షణమైన గానయోగ్యతను ఇనుమడింప జేస్తుంది.

రగడలకు ప్రాసనియమమూ, అంత్యప్రాసనియమమూ ఉన్నాయని చెప్పుకున్నాం‌ కదా. ఈ రెండు నియమాలూ వదిలి పెట్టి వ్రాయటం‌ అన్న పద్దతి కూడా ఒకటి తప్పకుండా ఉంది. అలా రగడలను వ్రాయటం‌ మంజరి అంటారు. హరిగతి మంజరీ రగడ అంటే హరిగతి రగడనే ప్రాసనూ‌ అంత్య ప్రాసనూ నియమంగా తీసుకోకుండా వ్రాయటం‌ అన్నమాట. మనం ద్విపదలనూ ప్రాసలేకుండా వ్రాస్తున్నప్పుడు వాటిని మంజరీద్విపదలు అంటున్నాం‌ కదా, అలాగే నన్న మాట.

హరిగతికి పాదానికి ఎనిమిది చతుర్మాత్రాగణాలు అన్నారు. అంటే 8 x 4 = 32 మాత్రల ప్రమాణం వస్తున్నది ప్రతిపాదానికి. గణాల కలగలుపు కూడదు. ఏగణానికి ఆగణం విడిగా రావాలి. "రాజరాజునకు" అని వాడామనుకోండి అది ఎనిమిది మాత్రల ప్రమాణం వస్తున్నది కదా దానిని రెండు చతుర్మాత్రాగణాలుగా తీసుకోండి అంటే‌ కుదరదు.

రగడను ఎవరూ‌ కేవలం రెండు పాదాలకు సరిపెట్టరు. కవులు అలా తోరణంగా వ్రాసుకుంటూ పోతారు.

హరిగతి రగడకు దగ్గరి బంధువు మధురగతి రగడ. హరిగతికి పాదానికి ఎనిమిది చతుర్మాత్రాగణాలు ఐతే, మధురగతి రగడకు పాదానికి నాలుగు చతుర్మాత్రాగణాలు. అంటే మధురగతి పాదాన్ని రెట్టిస్తే హరిగతి రగడ అన్నమాట.

హరిగతి రగడ అంతా చతుర్మాత్రలతో‌ నడుస్తున్నది కదా, అందుచేత ఈరగడకు చతురస్రగతి  నప్పుతుంది గానం చేయటానికి. తాళంగా ఏకతాళమూ త్రిపుట బాగుంటాయి.

ఇంక ధూర్జటి గారి శివస్తుతి రగడను చూదాం.









జయజయ కలశీసుత గిరికన్యా శైవలినీతట కల్పమహీరుహ
జయజయ దక్షిణరజతక్షితిధర సంయమిసేవిత పాదసరోరుహ

జయజయ పీన జ్ఞానప్రసవాచలకన్యా కుచ ధృఢపరిరంభణ
జయజయ కృతదుర్గాధరణీధర సామ్యవినోదవిహార విజృంభణ

జయజయ భారద్వాజాశ్రమ నవసరసిజకేళీవన పరితోషణ
జయజల నీలక్ష్మాధరణపుణ్యస్థల కాపాలిక భాషితభూషిత

జయజయ మోహనతీర్థాలోకన సంభ్రమరత భవబంధవిమోచన
జయజయ శిఖితీర్థాశ్రిత యోగీశ్వరమానస సంవిత్సుఖసూచన

జయజయ సహస్రలింగాలయ దర్శనమాత్ర స్థిరమోదాపాదక
జయజయ ఘనమార్కండేయమునీశ్వర తీర్థనిషిక్త విపఛ్ఛేదక

జయజయ నిర్జరనాయకతీర్థ స్నాతకజన కలుషేంధనపావక
జయజయ కరుణేక్షణ రక్షిత నిజచరణారుణ పంకేరుహసేవక

దేవా నిను వర్ణింప రమా వాగ్దేవీ వల్లభులైనను శక్తులె
నీ విధ మెఱుగక నిఖిలాగమముల నేర్పరులైనను జీవన్ముక్తులె

కొందఱు సోహమ్మని యద్వైతాకుంఠిత బుధ్ధిని నిను భావింతురు
కొందఱు దాసోహమ్మని భక్తిని గుణవంతునిగా నిను సేవింతురు

కొందఱు మంత్రరహస్యమవని నిను గోరి సదా జపనియతి నుతింతురు
కొందఱు హఠయోగార్థాకృతివని కుండలిచే మారుతము ధరింతురు

తుది నందరు తమ యిచ్చల నేయే త్రోవలబోయిన నీ చిద్రూపము
గదియక గతిలేకుండుట నిజముగ గని చాలింతురు మది సంతాపము

నిను సేవించిన కృతకృత్యుడు మఱి నేరడు తక్కిన నీచుల గొల్వగ
నిను శరణంబని నిలచిన ధీరుడు నేరడు తక్కిన చోటుల నిల్వగ

నీవనియెడు నిధి గాంచిన ధన్యుడు నేరడు తక్కిన యర్థము గోరగ
నీవే గతియని యుండెడు పుణ్యుడు నేరడు తక్కిన వారల జేరగ

భవదుర్వాసన పాయదు నీపదపంకజముల హృదయము వాసింపక
చవులకు గలుగవు సకలేంద్రియములు సతతమ్మును నిన్ను నుపాసించక

జననమరణములు ధరలో నిన్నును సమ్మతితో సేవింపక పాయవు
మననమునకు నీ చిన్మయరూపము మరగింపక యణిమాదులు డాయవు

మీ‌మాహాత్మ్యము మే మింతింతని మితి చేయగ మతి నెంతటి వారము
మామీదను కృపగల్గి మహేశ్వర మన్నింపుము నీకు నమస్కారము