1, సెప్టెంబర్ 2013, ఆదివారం

పాహి రామప్రభో - 229.. 232 ఉత్సాహరామాయణం (కిష్కింధకాండ)

సూర్యసుతుడు గిరిని డాయు చున్న వారి నిర్వురన్
సూర్యకులవివర్ధను ల్విశుధ్ధయశులగాంచి దు
ర్వార్యు లన్న వాలి బంప వచ్చినార టంచు గాం
భీర్య ముడిగి పవనసుతుని వేగు బంపె నంతటన్    229

 

 రవికులోత్తమునకు ప్రీతి రవిసుతునకు మైత్రి నా
పవనసుతుడు గూర్చె పిదప వాలి నొక్క కోల తో
భువిని గూలనేసి రామభూవరుండు రాజుగా
మివుల కూర్మి మీర నిల్పె మిత్రు గీశ భూమికిన్    230

 

వానకారు గడపి మాల్యవంత గిరిని రాము డా
వానరేశు పనిచె వేగపడగ సీత జాడ నె
ట్లేని వెదుక నపుడు గొప్ప ఠేవగల్గు వీరులన్
వానరోత్తములను రాజు బంపె నాల్గు దిశలకున్    231

 

హనుమ నపుడు బిల్చి ఇచ్చె నంగుళీయకంబు నో
యనఘ యవనిజాత జాడ లరయగలవు నీవు నా
మనసు బల్కు నినకులంపు మనికి నిల్పు వాడ వై
జనుమ టంచు ప్రియము లాడి స్వామి రామచంద్రుడున్    232