12, సెప్టెంబర్ 2013, గురువారం

చిలుకల చదువుచిలుకల చదివింప వలయు మీరనుచు
చెలికత్తియల తోడ చెప్పె సీతమ్మ
పలుకాడ నేర్పించి చిలుకల దెచ్చి
చిలుకల కొలికికి చెలు లిచ్చినారు

చెలులార చక్కగా చిలుక లన్నిటికి
విలువైన పలుకులే తెలిపి తెచ్చారె
కలభాషిణీ నీవె చిలుకల నడిగి
పలుకుల తీరులు తెలుసుకోవమ్మ

ముదితలారా మంచి ముద్దుమాటలను
చదివించినారలే చక్కగా మీరు
చదివించినది యేమొ సరసీరుహాక్షి
ముదమార అడుగవే ముచ్చట తీరు

ఇంత తొందరలోనె ఈ చిలుకలన్ని
ఎంతెంతె నేర్చెనే యేణాక్షులార
ఇంతిరో చదువుల కేది సారమ్మొ
అంత మాత్రము నేర్పి అర్పించినాము

తిలకించెదము వీని పలుకుల సౌరు
చెలులార యన్నదా సీతమ్మ తల్లి
కులుకుచు చెలులంత శీఘ్రమే యొక్క
చిలకను చేగొని పలుకరించారు

చిలుకవే చిన్నారి చిలుకవే నీవు
విలువైన విద్యనే తెలుసుకున్నావు
పలుకవే ఓ చిలుక బంగారు చిలుక
పలుకులం దొప్పైన పలుకేది యనిరి

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుచు
నోరార ముద్దుగా నుడివెనా చిలుక
శ్రీరామ యనుమాట చెవుల సోకగనె
శ్రీరామ యని యెల్ల చిలుకలు పలుక

రామభజనమ్ము నాలకించినది
గారాల చిలుకల తీరు మెచ్చినది
ఆ రామసతి ముదమార పల్కినది
మీరు నేర్పిన దెంత మేలైన చదువు

ఆమాట యీమాట యని చెప్పకుండ
నీమమ్ము గా మీరు రామనామమును
ప్రేమతో బోధించి వీని నన్నిటిని
రామచిలుకల జేసి రక్షించినారు

చెలులార ఇక రామచిలుకల పేర

ఇల మీద వీటికి నిలచేను పేరు
కలకంఠులార మీ గడుసుదనమున
చిలుకజాతికి మేలు చేకూరె నిట్లు


6 కామెంట్‌లు:


 1. సరి లేరు శ్యామలీయం వారికి ఇలలోన సాటి !

  చేకూరె నిట్లు మేలు చిలుకజాతికి
  మీ గడుసుదనమునను కలకంఠులార
  మెచ్చెదరు పిలిచి వారెల్ల ఇలమీద
  వీని రామచిలుకలని ఇక చెలులార !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. అబ్బబ్బా రామనామమత్యధ్భుతం, ఒప్పున ఏ భాగ్యశా'మ'లి'యమున'కబ్బునో’ రామ నామమత్యద్భుతమ్

  రిప్లయితొలగించండి
 3. chalabagundi. ituvanti yenno dvipadalu meenunchi aistu........Ramam, Kakinada

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చాలా సంతోషం.
   అంతా రామానుగ్రహం. ఆయన వ్రాయిస్తే మరికొన్ని తప్పక వస్తాయి.
   నా అంతట నేను వ్రాసేదేమీ ఉండదు.

   తొలగించండి
 4. చాలా బాగుంది ఇలాంటివి ఇంకా రావాలని ఆశిస్తున్నాను

  రిప్లయితొలగించండి
 5. బాహు..బాహు👌👌
  చాలా బాగుంది.శ్రీరామ నామామృతంతో భవ సాగరములు
  దైర్యం గా భక్తితో దాటవవచ్చును

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.