12, జూన్ 2026, శుక్రవారం

హరహర యటువంటి మాట యసలుండునా

హరహర యటువంటి మాట యసలుండునా
హరిభక్తుడ వింక లోపమన్న దుండునా

హరినామము నాశ్రయించి నది నిజమైతే
మరి రసనకు నన్యులనామములు చేరునా

హరిపాదము లాశ్రయించి నది నిజమైతే
మరి వేరొక్కనికి మ్రొక్క మనసు వచ్చునా

హరిభక్తుల నాశ్రయించు నది నిజమైతే
మరి పామరజనుల చేరు మాట యుండునా

హరిపూజల నాచరించు నది నిజమైతే
హరికన్యుల పూజించుట యన్న దుండునా

అరయ రామభక్తుడ వను నది నిజమైతే
పరమశివుడు నాగురువని పలుకకుందువా

హరిజపమున నీవు పండినది నిజమైతే
తరియించక మరల నీవు ధరకు వత్తువా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.