26, జూన్ 2026, శుక్రవారం

హరేరామ యని హరేకృష్ణ యని యాడవె ఓమనసా


హరేరామ యని హరేకృష్ణ యని

 యాడవె ఓమనసా

మరే మార్గమున మోక్షము రాదే

 బరాబరిగ మనసా


నిరంతరము శ్రీహరినామములే

 నీవు పలుకవలెనే

నిరుపమానుడగు శ్రీహరికీర్తిని

 నీవు చాటవలెనే

పరమాత్ముండగు శ్రీహరి కొకనికె

 నీవు మ్రొక్కవలెనే

తరచుగ శ్రీహరి చింతన లోనే

 నీవు గడుపవలెనే


నిర్మలచిత్తముతో హరి సేవలు

 నీవు చేయవలెనే

నిర్మత్సరతగ హరి భక్తులతో

 నీవు మెలగవలెనే

నిర్మోహుడవై శ్రీహరి కొరకే

 నీవు బ్రతుకవలెనే

నిర్మథితములై నీకర్మంబులు

 నీఱైపోవలెనే


నీ కేలోకుల పలుకుల ములుకులు

 తాకకుండవలెనే

నీకు శ్రీహరి హరికన నీవని

 నీవు తలచవలెనే

లోకంబున హరికన్యము లేదని

 నీకు తోచవలెనే

లోకేశుండగ శ్రీహరి మోక్షము

 నీకీయగవలెనే



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.