19, జూన్ 2026, శుక్రవారం

జనకజామనోభిరామ సాకేతరామ


జనకజామనోభిరామ సాకేతరామ
వినుము నేను నీకు చేయు విన్నప మొకటి

నా కడింది పుణ్యమునకు నీకు బంటు నైతిరా
నీకు గాక వేరెవరికి నేను విన్న వింతురా
లోకవృత్తములను గూర్చి నాకు చింత లేదురా
శ్రీకర యీజీవికి నీ సేవచాలు వినవయా

నీ వభయము నిచ్చెదవని నిన్ను చేరితిని కదా
నీ వాడను భక్తుడనని నిత్య మందునే కదా
నీవు తీర్చలేని కోర్కె నేను కోరనే కదా
భావజారివినుత రామ బాగుగ వినవయ్యా

నాకు కలుగు ముందటిగతి నీకెరుకే లేవయా
నాకరమును విడవనుచు నాకు వరము నీవయా
నాకమైన నరకమైన నాకు భయము కాదయా
నాకదియే చాలునయా నామొర వినవయ్యా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.