3, నవంబర్ 2026, మంగళవారం

మనకెందుకు పోనీ

 

మహి నెవ్వరి కేమహిమ యున్నదో

 మనకెందుకు పోనీ మనసా

మహిలో ఎవ్వరి మర్మమెట్టిదో

 మనకెందుకు పోనీ 


దినదిన మందరు వేల్పుల గొలుచుట

 మనకెందుకు పోనీ మనసా

పనిగొని వారిని వీరిని పొగడుట

 మనకెందుకు పోనీ

ధనముల కొరకై తలక్రిం దగుటలు

 మనకెందుకు పోనీ మనసా

మనుజుల నల్పులు మాటలు మిగిలిన

 మనకెందుకు పోనీ 


తనువుల కేవో తగులము లుంటే

 మనకెందుకు పోనీ మనసా

తనువుల కేవో తాపము లైతే

 మనకెందుకు పోనీ 

తనువుల వృధ్ధిక్షయములు గలిగిన

 మనకెందుకు పోనీ మనసా

తనవుల బాగోగులకై చింతలు

 మనకెందుకు పోనీ 


ఇనకులపతి చింతనమున కన్యము

 మనకెందుకు పోనీ మనసా

మన రాముని సేవలకు నప్పనివి

 మనకెందుకు పోనీ 

మనసాధన కనుకూలము కానివి

 మనకెందుకు పోనీ మనసా

మనకు మోక్షమే ముఖ్య మన్యములు

 మనకెందుకు పోనీ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.