8, జనవరి 2019, మంగళవారం

రాముడా నీశరము రాక్షసాధమ్ముని


రాముడా నీశరము రాక్షసాధమ్ముని
కోమలంబుగ దాకకూడదే యిదియేమి

పనిగ మారీచసుబాహులనెడు వారు
మునులుచేయు యజ్ఞములకు విఘ్నముల
ననవరత మొనరించు నట్టి వారే యొకని
పనిబట్టి వేరొకని వదలునా నీశరము

వదలినది కాదు సుబాహుని ప్రాణాలు
వదలినది మారీచు పడగొట్టి శరధిలో
పదునాలుగేండ్లీవు వనముల గ్రుమ్మర
కదలిరావలె వీడె కద మాయలేడిగా

కాలస్వరూపుడవు కాగల కార్యమ్ము
నేలీల జరుపుదో యెవ్వ రెఱుగుదురు
నీలమేఘశ్యామ నీబాణ మటుగాక
యేల రాకాసిపై జాలి చూపించును


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.