22, జనవరి 2019, మంగళవారం
మల్లెపూలతో శివుని మనసార పూజింప
మల్లెపూలతో శివుని మనసార పూజింప
తల్లి సీతమ్మకు తహతహ కలిగె
చెలులార చెలులార శివదేవుని మల్లెలతో
కొలచెదము కొల్లలుగ కోసుకొని రండన్నది
కలనైన మల్లెలను కనీవినీ యెరుగమని
చెలులందరు పలుకగా చింతించ దొడగినది
తెలిసి వదినమ్మ చింత తెచ్చి చూపె సౌమిత్రి
యలనాడు సీతారాము లొసంగిన దండలు
చెలులు రిచ్చపడి రవి చెక్కు చెదర కున్నవని
పలికె నతడు దివ్యదంపతుల మహిమచే నని
హనుమా ఓ హనుమా యని పిలచె సీతమ్మ
హనుమ వచ్చి యాజ్ఞగొని జనస్థానమున కేగి
కొనివచ్చెను విరబూచిన గుబురుమల్లె పొదలను
వనిత సీతమ్మచేసె తనివార శివపూజను
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
తనివారగ...
రిప్లయితొలగించండితనువా ? తనివా ?
తనివారు అంటే తృప్తిపడు అని అర్థం. తనివి + ఆరు => తనివారు. తనివి అంటే తృప్తి అనీ ఆరు అన్నదానికి కలుగు అననీ అర్థాలు. తనివారు లాగానే ఒప్పారు (ఒప్పు+ఆరు) అన్నసమాసం కూడా వాడుకలో బహుళంగా ఉంది. ఇక్కడ ఒప్పు అంటే ఒప్పుదల కలిగి ఉండు అన్న అర్థం. అలాగే మరొకపదం అడగారు అన్నది - ఇది బహుశః మరింతగా అందరికీ తెలిసినది కావచ్చును. దీనికి అడుగంటిపోవు అని అర్థం. అడగు + ఆరు -> అడగారు. అణగిపోవటం బాగా కలిగి ఉండటం. అంటే బాగా అడుగంటటం. ఇలాగు.
తొలగించండిఇంతకూ మీకు ఈ సంకీర్తనం నచ్చిందో లేదో చెప్పారు కాదు. ఐనా చదివే పదిపాతికమందిలో మీరూ ఉన్నారన్నదే పదివేలు నాకు.
తొలగించండికధానాయకురాలు(1970) సినిమాలో ఒక పాట ఉంది.
తొలగించండితనువా.... హరిచందనమే..
పలుకా.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే..
నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను
తనువు అంటే శరీరం అని అర్ధం చేసుకున్నాను. తనువారగ అంటే శివుని శరీరమంతా అని అనుకున్నాను. తనివారగ అంటే మరో అర్ధం ఉందా అని డౌట్ వచ్చింది. నాకు చంధస్సు రాదు కాబట్టి మీ పద్యాలు ఆశ్వాదించగలనే కానీ వ్యాఖ్యానించే సాహసం చేయలేను.
నీహారిక గారు, దగ్గరదగ్గరగా ఉండే గుణింతాలతో బోలెడు పదాలుంటాయి. అవి గమనించటమూ ఒక వినోదమే.
తొలగించండితనువు -> శరీరం
తనివి -> తృప్తి
ఒక్కోసారి అరసున్నాలూ బండిరాలూ కూడా మాటలను మార్చేస్తాయి!
కలుగు -> ఉండు (కలదు అన్న మాటలో ఉన్నది ఇదే)
కలుఁగు -> కన్నం
నీరు -> నీళ్ళు
నీఱు -> బూడిద (నిలువునా నీఱైనాడు అన్నట్లు)
నీహారిక గారు, శ్యామలరావు గారు చక్కగా వివరించేశారు లెండి. పైన మీరు ఉదహరించిన మధురమైన పాట ఎన్ని సార్లు విన్నా "తనివి" తీరదు 🙂👌. "తనివాఱు" అన్నా తృప్తినొందు అనే అర్థమే.
రిప్లయితొలగించండి