26, జనవరి 2019, శనివారం

పదితల లున్ననేమి పదిలమగు బుధ్ధిలేక


పదితల లున్ననేమి పదిలమగు బుధ్ధిలేక
చదువులు గలుగనేమి సరి వివేకము లేక

వరమడిగెడి వేళ వాడు వానరులను నరుల విడచె
నరులు వానరులవలన నాశనమును పొందె
వరగర్వము చేత వాడు బాధించెను లోకంబుల
హరిదాల్చెను నరవేషము నరకెను రావణుని తలలు

పరభామామణుల పట్టి పరిభవించు తుళువ తుదకు
పరసతివ్యామోహమునకు బలిచేసెను బ్రతుకును
నరనాథుడు శ్రీరాముడు నారాయణుడని యెఱుగక
ధరాత్మజను చెఱబట్టెను దానజేసి ధరను కూలె

ఇంద్రాదుల గెలిచె గాని యింద్రియముల కోడె నతడు
ఇంద్రాదులు పొగడ రాము డిలాసుతను గూడెను
సాంద్రకృపామూర్తియైన సాకేత విభుడు రామ
చంద్రమూర్తి స్వఛ్ఛ కీర్తి  శాశ్వతమై వెలుగొందెను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.