24, జనవరి 2019, గురువారం

వేడుకతో నిన్ను నేను వినుతించుచుందు నని


వేడుకతో నిన్ను నేను వినుతించుచుందు నని
గోడ వెనుక గుమిగూడిన కొందరు నవ్వేరు

ఏవేళ జూచినా నిదే ధ్యాస వీని కని
ఏవేవో యూహల నెపుడు వీడుండు నని
దేవుడని రాముడని తెగగొణుగు చుండునని
నావిధమును తప్పుబట్టి నవ్వుచుండేరయా

నరుల పొగడి తెగడి తుదకు నాకొఱుగున దేమిటి
హరిని పొగడ నగును కాక నరుల పొగడ నేటికి
పరులు నన్ను తప్పుబట్టి పరిహసింతురు కాక
తరచుగ హరి నీయందే తగిలియుండు నాబుధ్ధి

ఈ తనువున నేను దూరి యెప్పు డిల చేరితినో
నాతోడగు రామచంద్ర నాముందు నీవుండుట
చైతన్యము కలిగి బుధ్ధి చక్కగ నాడే యెఱిగె
నీతలపుల నాటగోలె నిత్యమై యుండగను


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.