25, జనవరి 2019, శుక్రవారం

తమకంబు మీఱ నిన్ను తలచేనో హరి సుమధురముగ చాల పొగడ జూచేనో


తమకంబు మీఱ నిన్ను తలచేనో హరి
సుమధురముగ చాల పొగడ జూచేనో

సకలసుగుణరాశి రామ సుకుమార ఓ
వికచోత్పలనయన చంద్రబింబవదన
రకరకముల మిక్కిలి రసవంతముల
అకళంకముల కీర్తనముల నమరించేనో

చవులుపుట్టు చరిత రామచంద్ర నీది నా
కవనమందు ప్రతిబింబించి చెవులకింపై
యవధరించు వారి కెల్ల నమిత భక్తి
చివురించగ కీర్తనముల చేయువాడనో

తారకనామ రామ నిన్ను తలచువారి యే
కోరికైన నేల తీరకుండు నయ్య
ధారుణి నే నిలచునంత తడవు నిన్ను
సారెకు కీర్తించి నిన్ను చేరుకొందురా

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.