21, జనవరి 2019, సోమవారం

మల్లెలు తెచ్చి సీతమ్మ మాలలు కట్టినది


మల్లెలు తెచ్చి సీతమ్మ మాలలు కట్టినది
మల్లెలమాలలు మురిపెముతో మగనికి వేసినది

కొల్లలుగాను మాలలు తెచ్చి కోమలి వేయగను
నల్లనివాడు రాముని గళము నాతిమహిమ చేత
తెల్లగ నగుట లెస్సగ చూచి దేవర లక్ష్మణుడు
మెల్లగ నగియె ముసిముసి గాను మిగుల సంతసించి

కొన్ని మాలలు రాముడు తీసి కోమలి మెడ నుంచ
సన్నసన్నని సిగ్గులు తోచ జానకి యాత్మేశు
మన్నన కెంతొ మురియుచు నుండ మరిది లక్ష్మణుండు
అన్నావదినెల సరసము జూచి యమిత ముదమునందె

దండ లన్నియు మనమే గొనుట ధర్మము కాదనుచు
దండి మగడు శ్రీరాము డొక్కటి తమ్ముని కందించె
వెండి సీతమ్మయు నొక్కటి ప్రీతి మరది కిచ్చె
పండెను నా బ్రతుకని తనతలపై నిడుకొనె నతడు