20, ఏప్రిల్ 2012, శుక్రవారం

వేగ కనరావయ్య వేదాంత వేద్య


వేగ కనరావయ్య వేదాంత వేద్య
వేగ కనరావయ్య జాగేల రామ

కొఱగాని కలలతో కలత నిద్దురె గాని   
పరమైన ఇహమైన నరయరా దయ్యయ్యొ
అరుదు చేసితి వేమి యగుపడుటయే నీవు
మరలమరల రాక మంచిదే యగు కాద

ఘనమైన రూపమ్ము గొనినీవు కనరాగ
కనులార వీక్షించి కలుషమ్ము లారగా
మనసార కీర్తించి మరి నేను పొంగితిని
తనివి తీరగ మరల దరిశనం బీవయ్య

ఒకసారి జూచి నే నొడలు మరచితి నాయె
యికమీద నినుజూచి యిల నుండ గోరనని
యొక వేళ శంకింతువో నీవు నను జూచి
యిక నిన్నే నెడబాసి యేరీతి నుందురా

4 కామెంట్‌లు:

  1. Corrected version

    సంబంధం ఉందనిపించి ఈ రెండు ముక్కలు...:)

    శ్రీ తురగా వేంకటరామయ్య గారు మీరిది రాస్తారని 1940ల్లోనే ఊహించినట్టున్నారు....:) శ్రమజీవి 1941 పత్రికలో ప్రచురితం


    ఈ కసాయి జగమ్ము
    నెట్లు సృష్టించితివి?
    ఇంతమతిలేదేల దేవా!

    కఱువులెరుగని స్వర్గ
    కల్యాణసీమలో
    కాపురమునీకేల? దేవా!

    సాధుజీవాల వె
    చ్చనిరక్తమాంసాలు
    తిను వ్యాఘ్రలోకమిది దేవా!

    పులికోరలకు దివ్య
    పుష్పజీవాలేల
    పీనుగుల్చాలవా? దేవా!

    హృదయమెరుగని శిలా
    ప్రతిమలను ప్రేమించు
    పాషాణ లోకమిదిదేవా

    కఠిన పాషాణాలు
    కరుగునాపాటలకు
    కాలాగ్నికేగాని దేవా!

    ఆశాపిశచ ఘో
    రకరాళ దంష్టాగ్ర
    గళిత కంకాళమిది దేవా!

    జీవతేజస్సృష్టి
    జేసి రక్షింతువా?
    భస్మమ్ము జేతువా? దేవా!

    రిప్లయితొలగించండి
  2. అన్నిట నా పరమాత్మను
    అన్నా ! కనుటన్న ఙ్ఞాన మందరి వశమా ?
    పన్నుగ తమ వంటి ఘనుల
    నన్న - గని తరించు భాగ్య - మబ్బునొ లేదో ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కం. మిక్కుటమగు ప్రేముడితో
      లక్కాకులవారు మెత్తు రంతియ యగు నా
      కెక్కడిది జ్ఞాన మాతడె
      నిక్కముగా నన్ను బట్టె నెంతయు దయతో

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.