21, ఏప్రిల్ 2012, శనివారం

నిజమే నేమో లే నేమో యే ఋజువులు సాక్ష్యము లేలా

నిజమే నేమో లే నేమో యే
  ఋజువులు సాక్ష్యము లేలా నా
నిజరూపము నీ దివ్యవిభూతీ
  విజయవిలాసవిశేషమేమో

నానారూపము లందున నీవు
  నానాలోకము లందున నుందువు
మానవరూపము మరియటులే గద
  పూని ధరించితివో యీ దేహము

లేని నాకు యిటు లేల నుంటినని
  లేని పోని తలపేలా గలిగెను
కాని తలపుల కాలము చనగా
  కానగ నైతినిగా నిజతత్వము

పోనీలే యిపుడైనా విషయము
  జ్ఞానదృష్టికి సంధించితివి
మానక నీ యందే నిలచెద
  నేనని వేరుగ లేనే లేనుగ

2 వ్యాఖ్యలు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.