24, ఏప్రిల్ 2012, మంగళవారం

అరెరే ఇటు వచ్చానే అనుకోకుండా

అరెరే ఇటు వచ్చానే 
  అనుకోకుండా
తిరిగి పోయే దారేదో 

  తెలుసుకోకుండా

వింతలు చాలా చూడాలని 

  పిచ్చి ఊహతో వచ్చాను
వింతగ నేనీ లోకమనే 

  పెద్ద ఉచ్చులో పడ్డాను

అందాలన్నీ బందాలేగద 

  అని నువ్వు ఊర కున్నావు
తొందరపడినే చిక్కుపడితె  కని 

  తుళ్ళుతు నవ్వుతున్నావు

నీవాడ నేనని నేనే నీవని 

  యేవోవో చెబుతుంటావు
నావాడ వైతే నన్ను చప్పున 

  కావగ  రాకుండపోవు

6 వ్యాఖ్యలు:

 1. అన్నీ బందాలేనండి. కట్టు మీద కట్టెయ్యమన్నారు చాగంటివారు. ప్రయత్నిద్దాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కష్టేఫలీ శర్మగారు. నా బ్లాగు(ల)కు స్వాగతం. మీ సందర్శనం నాకు తెలిసి యిదే మొదటిసారి. ఆనందం.
  మనఃఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః! ఇంద్రియములు ఒక్కొక్కటి ఒకటి రెండు విషయముల యందు ప్రవృతమౌతూ వాటి యందు లాలస చేత బంధితమౌతుంది. ఇంద్రియాధిపతియైన మనస్సు ఇంద్రియసమాహారము అలవరచిన సుఖానుభూతియందు లాలసకలిగి ఉంటుంది. ఈ సుఖానుభూతికే 'అందం' అనేది ఒక్ ప్రతీక. ఎందువలన అంటే, ఈ మాట చేత ఇంద్రియములకు ప్రకృతియందు కలిగే ఆకర్షణ సూచితమౌతున్నది గనక. చిత్తము అంతర్ముఖం కాక ఐంద్రియ వృత్తుల యందు లగ్నమై ఉండి స్వస్వరూపావబోధనుండి చ్యుతమై పోతున్నది. ప్రకృతిచేత బంధితమైతున్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. బాగుందండీ.. కష్టే ఫలే గారి వ్యాఖ్యానం..వ్యాఖ్యానం కి వ్యాఖ్యానం లో వేదాంతం గోచరించినది. నిజమే అనుకోండి.. అయినా ఏమిటో జీర్ణించుకోలేక.. కించిత్ బాధ అనాలేమో!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వనజగారూ,
  మీ కోసం సులభంగా.
  కన్ను, చెవి, నాలుక లాంటి ఇంద్రియాలన్నీ ఏదన్నా స్పెషల్ అంటూ ఆరాటపడతాయి కదా.
  మనస్సు ఇంద్రియాలకు రాజు. అది కూడా ఏదన్నా స్పెషల్ అంటూ ఆరాటపడుతూనే ఉంటుంది.
  ఇలా ప్రకృతిలో అందంగా స్పెషల్ గా ఉండేవి అన్నీ ఇంద్రియాలను తద్వారా మనస్సును బంధిస్తున్నాయి.
  మనస్సు అంతర్ముఖం అయితే ఆత్మస్వరూపంగా ఉంటుంది. ఇలా బహిర్ముఖం అయితే బంధాల్లో పడిపోతుంది. అంతే.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మరి మనస్సు ఎలా ఉండడం సరయినది శ్యామలీయం గారూ!

   తొలగించు
  2. కొందలరావుగారూ
   భారతీయమైన వేందాంతదృక్పథం ప్రకారం జీవుడు తత్వతః ఆనందస్వరూపుడు. ఈ ఆనందం అనేది అతడి స్వభావమేకాని బయటి ప్రపంచం (అంటే ప్రకృతి) యొక్క ప్రేరణ వల్ల లబించినది కాదు. ఎప్పుడైతే జీవుడు ఆనందం అనేది ప్రకృతి వలన లభిస్తున్నదనే భ్రాంతికి గురి అవుతాడో అప్పుడు ఆ జీవుడు ప్రకృతి యొక్క స్వభావం అయిన మాయకు వశుడై జననమరణాల చక్రభ్రమణంలో చిక్కుకుంటాడు. ప్రకృతి ద్వారా లభించే ప్రతి సుఖమూ యేదో విధంగా దుఃఖం గానే పరిణమించటం దాని నైజం. జీవుడు మాయ నుండి విడివడి తన సహజస్థితిని పునరుధ్ధరించుకోవటాన్నే ముక్తి అంటారు. ముక్తి అన్న మాటకు విడివదటం అనే అర్థం. ప్రకృతికి చిక్కిన జీవుడికి శరీరం ఉంటుంది - ప్రాకృతికమైన సుఃఖదుఃఖాలను అనుభవించటానికి. ఆ అనుభవాలను అందించేది మనస్సు. ఆ మనస్సుకు ఇంద్రియాలు అనుభూతుల్ని అందించే ఉపకరణాలు. మీ రడిగిన ప్రశ్నకు సమాధానం యేమిటంటే, ఇంద్రియాలనుండి మరలి మనస్సు ప్రకృతి ప్రభావం నుండి బయట పడి స్వస్వరూపాను సంధానం చేయటాన్ని అభ్యాసం చేయాలి. స్వస్వరూపస్థితిని పొందిన జీవుడు తానే విశ్వాత్మనని గ్రహించి శాంతిని పొంది తనకు సహజమైన ఆనందస్థితిలో ఉంటాడు. అదే నిర్వాణం.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.