26, ఏప్రిల్ 2012, గురువారం

ఒక నాటికి తాను నీవు నొకటే నని తెలిసేను

జననీగర్భము లోనే తనువది కలిగేను
  మనసు నింద్రియములుకూడ దానికి కలిగేను
తనకు మరల పుట్టువని  కనుగొని వగచేను
  వెనుకటి జన్మముల వెతలను తలచేను

ఎంతవగచి లాభమేమి యిలకు తరలి వచ్చేను
అంతలోనె యన్ని మరచి ఆటలాడ జొచ్చేను 


మరల ప్రకృతి మాయలు మరల పుణ్యపాపములు
మరల ప్రజారుజాదులు మరల జరామరణములు
 

తనువు తాను కానని తాను తెలియు కుండును
తనువులు దాల్చుచు వదలుచు తపన చెందు చుండును


అపుడపుడు నిన్ను దలచి యలమటించు చుండేను
ఎపుడయ్యా ముక్తి యని యేడ్చుచు నడిగేను


ఒక నాటికి తాను నీవు నొకటే నని తెలిసేను
అకళంకస్వస్వరూప మందు నిలచి వెలిగేను

4 వ్యాఖ్యలు:

 1. శర్మగారూ, సర్వవ్యాపకత్వము చేత అతడు విష్ణువని పులువబడుతున్నాడు. సంతోషం మీ వ్యాఖ్యకు.
  ఈ శ్యామలీయం బ్లాగులో ఇప్పటికి రమారమి యాభై ఆధ్యాత్మికమైన కవితలున్నాయి. వీలు వెంబడి చదివి మీ అమూల్యాభిప్రాయాలు తెలియజేయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అర్ధవంతంగా ఉంటున్నాయి మీ రచనలు
  మీ కావ్యాలు ఏమైనా ఉన్నాయా
  తెలియజెయ్యండి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. బాలకృష్ణా రెడ్డిగారు,

   మీ ఆసక్తికి చాలా ధన్యవాదాలు. పెద్దల ప్రోత్సాహంతో కావ్యరచనకు శ్రీకారం చుట్టటం జరిగింది.
   నా మరొక బ్లాగు ( http://syamalatadigadapa.blogspot.in/ ) 'నవకవనవనం' లో 'శ్రీమధ్భాగవతమహాత్మ్యం' వ్రాస్తున్నాను. ప్రథమాశ్వాసము సంపన్నమైనది. ద్వితీయాశ్వాసం మెదలుపెట్టాను కాని పని ఒత్తిడి తద్వారా సమయాభావం కారణంగా కొంచెం విరామం వచ్చింది. త్వరనేలో మరలా ధారావాహికగా అనుదినం వ్రాస్తాను.

   అన్నట్లు నా మరొక బ్లాగు జ్యోతిశ్శాస్త్రం ( http://jyotissastram.blogspot.in/ ) లో తఛ్ఛాస్త్రవిషయకములైన టపాలు వేస్తున్నాను.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.