25, ఏప్రిల్ 2012, బుధవారం

నాకు నీవు కలుగు దారి నాకు తెలియ వచ్చు టెట్లు

ఏవేవో ధర్మములు యేవేవో శాస్త్రములు
ఏవేవో విద్యలు నే నేవి నేర్వవలయు
ఏవేవో తెలుపు గాని యెరుక పరచ లేవు
నిన్నెరుక పరచ లేనివి నేనేల నేర్వవలయు

నేను నేను నే ననుకొను నేనెటుల కలిగినాను
నేను నీవు నొకటైతే నేను దేని కున్నాను
నేను మాయవల లోపల నేల చిక్కుకున్నాను
నేను నిన్ను జేరి దీని నెల్ల తెలియ దలచినాను

ఎచటి నుండి వచ్చితిని యెచటి కేగ నుంటిని
నడుమ నిచట నీ మజిలీ యేల చేయుచుంటిని
అటునిటు నే తిరుగనేల నటమటపడ నేల
ఇటువంటివి నిన్ను జేరి యెరుగ దలతు నేను

నీకన్నా తెలియ జెప్ప నేరుపు గల వారెవ్వరు
నీ కొరకెంతో వెదకితి నెందు గాన బడయనైతి
నీకు కరుణ కలుగు విధము నాకు తెలియ వచ్చు టెట్లు

నాకు నీవు కలుగు దారి నాకు తెలియ వచ్చు టెట్లు

5 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. టైటిల్ మర్మమేమిటో సెలవీయండి అన్నారు అనికేతులవారు.

      కలుగు అనే మాట ఇబ్బంది పెట్టిందా?
      కలుగు అనే మాటకు 'ఉండు' అనే అర్థం అప్రసిధ్ధం గాదు, వ్యవహారంలో ఉన్నదే!

      కలుగడే నాపాలి కలిమి సందేహింప
      ... గలిమి లేములు లేక గలుగువాడు
      .........
      .........
      .............(శ్రీమదాంధ్రభాగవతం. గజేంద్రమోక్షం ఘట్టంలోని పోతన పద్యం)

      ఇంత డబ్బుకలదు, అంతమంది బంధువులు కలరు వంటివి కాక నాకు భగవంతుడు కలడు అనుకోగలగాలి. అలా అనుకుందాం అనుకుంటే ఆత్మీయంగా ఆయన మనపట్ల కలగాలి గదా! అందుకు దారి యేమిటో తెలియటం లేదు. యే శాస్త్రాదులూ పూర్తిగా ఉపయోగపడటం లేదని విచారం.

      అర్థమైన దనుకుంటాను.

      తొలగించండి
  2. నేనెవరు అని ప్రశ్నించుకోమన్నారు భగవాన్ రమణులు. అది తెలిస్తే గొడవే లేదు కదా. అదే తెలియటం లేదు. దారీ తెలియటం లేదు మరి. దారి వెతుక్కోడానికే ఈ తపన.

    రిప్లయితొలగించండి
  3. బాగుంది.know thy self అన్నారు కదా!ఒక సారి నా బ్లాగు ను గమనించగలరు.జీవితం ఫై వ్రాస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. రవిశేఖరుగారు,
    మీ profile లో మీ బ్లాగు వివరం లేదు. దయచేసి మీ బ్లాగు వివరాలివ్వండి.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.