19, సెప్టెంబర్ 2011, సోమవారం

రాను రాను

రాను రాను నేనూ నీలా తయారవుతున్నా
జ్ఞానమో అజ్ఞానమో నేను జడుణ్ణవుతున్నా

నాదనుకో దగ్గదేదీ నాకగుపడటంలేదు
ఏదీ ఉధ్ధరించదని తెలిసొచ్చిన క్షణంనుండి
ఈ దేహంతో సహా యేదీ నాది కానే కాదు
నాదంటే నాది  నా అస్తిత్వం మాత్రమే

నా లోపల యీ సత్యం మారుమ్రోగుతున్నది
నా చుట్టూ యీ ప్రకృతి నాట్యం చేస్తున్నది
నా ఉనికిని యీ కాలం నిత్యం ప్రశ్నిస్తున్నది
నా అస్తిత్వం నువ్వే సదా నువ్వు మాత్రమే

మనిద్దరం బింబ ప్రతిబింబాలమని తెలిసాక
యితర ద్వంద్వాలన్నీ యిట్టే మాయమయ్యాయి
నేనూ నీవూ ఒకటని నేను తెలుసుకున్నాక
పోనీ చేద్దామన్నాసరే పనే లేక పోయింది

2 వ్యాఖ్యలు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.