11, సెప్టెంబర్ 2011, ఆదివారం

పూజ

తొలుత నీవు మహద్రూప కలిగించితి వాకసమును
వెలుగు లీను తారకలను విరజిమ్మితి వాకసమున
ధగధగల జాబిల్లిని తగిలించితి వాకసమున
వెలుగుముద్ద సూర్యుడిని వెలయించితి వాకసమున
గ్రహమండలి నతనిచుట్టు కల్పించితి వాకసమున
వాటిలోన వసుధ నీ నివాసమాయె నాకసమున

వివధ నదులు సాగరములు వెలయింవితి వాదరమున
భూధరముల పంక్తులు భువి వెలయించితి వాదరమున
మృగజాతులు వనసీమలు వెలయించితి వాదరమున
మృదులలతావితానములు వెలయించితి వాదరమున
పూవులు తుమ్మెదలు పుడమి వెలయించితి వాదరమున
బిలబిలాక్షి కువకువలను వెలయించితి వాదరమున

అందమైన పుడమిని నీ వడుగిడితివి నా రూపున
యగయుగాలుగా నిచ్చట నిలచినావు నా రూపున
జగము నేలుకొను చుంటివి సంతసమున నా రూపున
నీవే నేను నేనే నీవై యున్న ఘనుడ నారూపున
నున్న నిన్ను కొలుచు ప్రకృతి నిలచిపొమ్ము నారూపున
ముందు ముందు కూడ నీవు నిలచిపొమ్ము నారూపున

మానసమే మహితపీఠ మగునుగాక నీ పూజకు
మనసుచేయు ఊహలెల్ల మంత్రములే నీ పూజకు
కనుల వెలుగు లనవరతము హారతులగు నీ పూజకు
వివధకర్మ ఫలము లెల్ల నైవేద్యము నీ పూజకు
నడకలెల్ల నిరంతరము నాట్యసేవ నీ పూజకు
గాన సేవ రసనా విన్యాస మెల్ల నీ పూజకు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.