3, జులై 2020, శుక్రవారం

దగాకోర్లూ‌ మోసగాళ్ళూ అందరూ ఉన్నత కులజులేనా?

మిత్రులు లక్కాకుల వెంకట రాజారావు గారి సుజన-సృజన బ్లాగులో జ్యోతిషానికి సంబంధించిన రసవత్తరమైన చర్చ ఒకటి నడుస్తున్నది. ఆసందర్భాన్ని పురస్కరించుకొని, నా అభిప్రాయాలను తెలియజేయటానికి ప్రయత్నిస్తున్నాను.

ఇక్కడ చర్చకోసం వైద్యరంగాన్ని కూడా కలిపి ప్రసంగిస్తున్నాను. అంతమాత్రం చేత ఆ వైద్యరంగం పట్ల నాకేదో ద్వేషం వంటిదేదో ఉందనో లేదా జ్యోతిషం పట్ల నాకు మితిమీరిన ప్రేమ ఉందనో భావించవద్దని మనవి.

రాజారావు గారు ఒక మాట అన్నారు, నమ్మకమే జ్యోస్యుల వ్యాపార పెట్టుబడి అని. వారి భావాన్ని ప్రత్యేకించి విశ్లేషించి చెప్పనవసరం లేదు. వారు సూటిగానే చెప్పారు. ఒకముక్క అడుతున్నాను. మనం హాస్పిటళ్ళచుట్టూ తిరుగుతున్నాం. ఒకప్పుడు ఇంత లేదు. ఇప్పుడు అంతా కార్పొరేట్ వైద్యం. ఫామిలీ డాక్టర్ అన్న పధ్ధతి లేకుండా పోయింది. ప్రతి చిన్న సమస్యకు కూడా స్పెషలిష్టు దగ్గరకు పరుగెడుతున్నాం. మళ్ళా కార్పొరేట్ హాస్పిటళ్ళలో వైద్యం పేర దోపిడీ జరుగుతోందనీ నిత్యం గోల పెడుతూనే ఉన్నాం. మరి ఆ దోపిడీ‌కి కారణం ఏమిటి? మన నమ్మకమే పెట్టుబడిగా ఆ హాస్పిటళ్ళు దోపిడీ చేయటం లేదా? అవసరం లేని టెష్టులు చాలా అవసరం అని ఆ హాస్పిటళ్ళలో డాక్టర్లు మనని నమ్మించటం లేదా? అవసరం ఏమాత్రం లేకపోయిన సందర్భాల్లో కూడా అతితరచుగా ఈమధ్య పేషంట్లని ఈ డాక్టర్ల చేత అక్షరాలా చెప్పించి మరీ ఐసీయూల్లో కుక్కటం లేదా ఈ కార్పొరేట్ హాస్పిటళ్ళు?  కాని మనం తొందరగా నమ్మకమే డాక్టర్ల వ్యాపార పెట్టుబడి  అనో నమ్మకమే హాస్పిటళ్ళ వ్యాపార పెట్టుబడి అనో‌ ఎందుకని అనటం లేదూ? ఎందుకంటే ఆధునిక విజ్ఞానం ఈ డాక్టర్లు వాడుతున్నారు కాబట్టీ ప్రాచీనమై తుప్పుపట్టిన జోస్యాన్ని జ్యోతిష్యులు వాడుతున్నారు కాబట్టీ కదా?

విన్నకోట నరసింహారావు గారు అన్నట్లు అంతావ్యాపారమయం ఐపోయింది. అలా జ్యోతిషాది పాత శాస్త్రాలే కాదు అధినిక వైద్యాది విజ్ఞాన శాస్త్రాలూ నేడు వ్యాపారమయం ఐపోయాయి. నిజం.

చాలామంది జ్యోతిషాన్నిఆధునిక వైద్యం ఎదురుగా నిల్చోబెట్టటాన్ని హర్షించలేక పోవచ్చును. కాని మనం ఏమనుకుంటున్నాం అన్నది అటుంచి జ్యోతిషం ఒక వేదాంగం. ఒక శాస్త్రం. మనం నమ్మినా నమ్మకపోయినా ఏశాస్త్రమూ‌ కూడా శాస్త్రం కాక పోదు.

పొట్టకూటి వేషగాళ్ళు చేరి భ్రష్టుపట్టించనిది ఏదన్నా శాస్త్రం ఉందా? అది సంప్రదాయిక వైదిక శాస్త్రాల్లో ఐనా, ఆధునిక విజ్ఞానశాస్త్రాల్లో ఐనా? అందుకే ఇక్కడ పోలికతెచ్చి విశ్లేషించి చూపటం. దయచేసి అర్ధం చేసుకోగలరు.

ఆధునికవైద్యశాస్త్రాన్ని సొమ్ములు సంపాదించుకొనేందుకే ఎక్కువగా వాడుకుంటున్నారా లేదా నేటి డాక్టర్లలో హెచ్చుమంది? అంత మాత్రాన ఆధునికవైద్యం బూటకం అని మనం అనలేం‌ కదా. కాని సుళువుగా పొట్టకూటి జోస్యులను చూపి జ్యోతిషశాస్త్రం బూటకం అనటంలో అంత న్యాయం లేదేమో అన్నది ఆలోచించాలి.

ఇద్దరు మంచి డాక్టర్లే ఐనా చేసే చికిత్సలో పైకి ఐనా తేడా ఉంటోంది కదా, అది మనం అర్ధం చేసుకుంటున్నాం‌ కదా సహజమే అని? కాని ఇద్దరు జోస్యులు విభిన్నమైన ఫలితాలు చెప్పినంత మాత్రాన అదిదో చూడండి జ్యోతిషం శాస్త్రం కాదు బూటకం అని వేరే ఋజువు కావాలా అనటంలో తొందరపాటుదనం ఉందేమో‌ అని కూడా ఆలోచించాలి.

ఆవలివాడి భయం అన్నది సొమ్ము చేసుకుందుకు లేదా భయపెట్టి మరీ ఆ భయం నుండి లాభపడటానికి ప్రయత్నించటం అన్నది తప్పుడు మనుషుల ఆలోచనావిధానం. అటువంటి విధానంలో జోస్యులు దిగ్విజయంగా బ్రతగ్గలిగితే వారిలో అత్యధికులు కోటీశ్వరుగా ఉండాలి. కాని అత్యధికులు ఏదో‌ పొట్టకూటికోసం జ్యోతిషాన్ని నమ్ముకొనే వారిగా ఉన్నారన్నది గమనించ దగిన సంగతి. అదే సమయంలో విజ్ఞులు మరొక విషయం గమనించగలరు. నేటి డాక్టర్లలో హెచ్చుమంది రోగుల భయపెట్టి మరీ‌ ధనసంపాదన చేస్తున్నారు. వారిలో అత్యధికులు దినదిన గండంగా యేమీ‌ బ్రతకటం లేదు.

భవిష్యత్తును ముందుగా తెలుసుకోవాలనుకోవడం దురాశ . ఈ‌ మాట తప్పక ఒప్పుకోవాలి. ఎంతో నిజం. ఒక జోస్యుడి దగ్గరకు వెళ్ళే సగటుమనిషి రాబోయే కాలంలో అన్నా కాస్త పరిస్థితులు మెరుగుపడతాయా అన్న ఆశతో వెళ్తున్నాడు కాని, రేపు ఎన్నిమేడలు కట్టబోతున్నానో అన్న దురాశతో వెళ్ళటం లేదు. నిజానికి అంతా బాగున్నప్పుడు ఎవడూ వైద్యుడి దగ్గరకూ వెళ్ళడు జోస్యుడి దగ్గరకూ వెళ్ళడు!

జోస్యుడిని ఎంత త్వరగా పరిస్థితులు మెరుగౌతాయీ అని అడుగుతాడు సగటుమనిషి. వాడే డాక్టరును జబ్బు ఎంత తొందరగా నయం అవుతుందీ అనీ అడుగుతున్నాడు. డాక్టరును అడిగినప్పుడు అది ఆశగానూ జోస్యుడిని అడిగినప్పుడు దురాశగానూ చెప్పవచ్చునా? అలా చూడటం సబబు కాదేమో అని యోచించ వలసింది.

రాజారావు గారు జ్యోతిష్యం నమ్మడం , కార్తాంతికులు నమ్మబలకడం మోసం ,దగా అని నిష్కర్ష చేసారు. నిజానికి ఎవరన్నా అసత్యపూర్వకంగా మరొకరిని నమ్మబలకటం ఎప్పుడూ దగా క్రిందకే వస్తుంది. ఆనమ్మబలికే వాడు కార్తాంతికుడైతే మాత్రమే కాదు అలాంటి వాడు కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ ఐనా సరే మనం మోసం దగా అనే అనాలి.

అన్నిరంగాల్లోనూ ఈ మోసం దగా ఉన్నదని మనకు తెలుసును. పిల్లలను మళ్ళా కార్పొరేట్ బళ్ళలో వేస్తున్నాం. వాళ్ళు లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. కాని అరకొర చదువులు చెప్తున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. అప్పుడు ఆ కార్పొరేట్ విద్యావ్యవస్థనిండా మోసం దగా ఉన్నదని మనం ఒప్పుకోవాలా లేదా?

నమ్మి ఓట్లు వేసాక రాజకీయవ్యవస్థలో జనానికి అందుతున్నది సాధారణంగా నమ్మకద్రోహాలే. అక్కడా మోసం దగా తప్ప మరేమీ లేదు. అదీ మనం ఒప్పుకుంటున్నాం.

ఇన్ని చోట్ల, మరిన్ని చోట్ల, నిజానికి అన్ని చోట్లా మోసం దగా వంటివి మాత్రమే చూస్తూనే కేవలం‌ పొట్టకూటి జోస్యులను మాత్రమే మోసగాళ్ళు దగాకోర్లు అని శపిస్తూ జ్యోతిషం అంతా హంబగ్ అనేయటం ఏమంత న్యాయమైన పనో మనం ఆలోచించవలసి ఉంది తప్పకుండా.

ఇంక ముగించే ముందు ఒక్క సంగతి మనవి చేయదలచుకున్నాను. అందరున్నత కులజులే అని తమ యీ టపాకు పేరు పెట్టారు రాజారావు గారు. అంత సబబుగా అనిపించలేదు నాకు. అలాగని వారి అభీష్టాన్ని అధిక్షేపించటం లేదు. వినయంగా ఒక్క మాట అడుగుతున్నాను.  రాజారావు గారు తమ పద్యాన్ని ముగిస్తూ "అంద రున్నత కులజులే , అందులోను శాస్త్ర పాండితీ ధిషణులే ,  చదువు నింత ఘనముగా వాడుచున్నారు కడుపు కొఱకు" అన్నారు. జ్యోతిర్విద్య కేవలం అగ్రవర్ణాలకే పరిమితం ఐనది కాదండీ. ఒకప్పుడు అలా ఉండేది అని అనుకున్నా, నేడు అందరికీ అందుబాటులోనే ఉంది. ఎందరో అగ్రవర్ణాలకు చెందని వారూ జ్యోతిష్యపండితులు ఉండవచ్చును. కేవలం అగ్రవర్ణాలవారు మోసం దగా కోసం జ్యోతిషం అనే‌ నాటకం ఆడుతున్నారని అని నిందించటం అంత ఉచితం అంటారా?  నేటి సర్వరంగాల్లోనూ నడుస్తున్న మోసాలూ దగాలూ కేవలం అగ్రవర్ణాలే చేస్తున్నాయంటే చెప్పగలగింది ఇంకేమో లేదు. కాని అది మానవుల దురాశ కారణంగా నడుస్తున్న వ్యవహారం అని అందరకూ తెలిసిందే. కేవలం అగ్రవర్ణాలను మాత్రమే నిందించటం అంత హర్షించలేక పోతున్నాను మన్నించాలి.

17 కామెంట్‌లు:

 1. మీరు సత్యం వాస్తవం చెప్పారు పై వ్యాసం లో. Corporate

  ఆస్పత్రుల, పాఠశాలల వారి వాదనలో - నెల తిరిగే సరికి వందల మందికి జీత భత్యాలు, నిర్వహణ ఖర్చులు , అధునాతన యంత్ర సామగ్రి..ఈ కారణాలు వల్ల ఆ ఖర్చు మొత్తం చికిత్స పొందేవారు నుంచి వివిధ మార్గాలలో రాబట్టుకుంటున్నము అంటారు.

  జ్యోతిష్కుల ను నిందించడం సరికాదు . ఉదర పోషణార్థం బహుకృత వేషం

  తనకు గిట్టుబాటు కాకున్నా పంటలు పండించి అందరి ఆకలి తీరుస్తున్న రైతు ఒక్కడే అతి నిస్వార్థ జీవి ధన్య జీవి అని చెప్పాలి.


  రిప్లయితొలగించండి


 2. పొట్టకూటి జోస్యులను మాత్రమే మోసగాళ్ళు దగాకోర్లు అని శపిస్తూ..
  .


  సరియైన బదులిచ్చిన టపా.

  ఈ మధ్య కాలం లో జ్యోతిష్యాన్ని ఆడిపోసుకునే వాళ్ళెక్కువై పోయేరు. హాస్యాస్పదమేమంటే మళ్ళీ‌ ఈ‌ ఆడిపోసుకునే వాళ్ఙలో చాలా మంది వర్జ్యం‌ గట్రా చూడకుండా కాళ్ళు కదపరు.

  మంచి టపా.  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు. బక్కవాడి మీద రాయి వేయటం నిరపాయకరం కదండీ. పాపం జోస్యుడు ఏమంటాడూ తన గ్రహచారం బాగోలేదూ అనుకోవటం తప్ప.

   తొలగించండి
 3. దగాకోర్లూ‌ మోసగాళ్ళూ అందరూ ఉన్నత కులజులే...

  నిజం నిజం..గొప్పగా నుడివితిరి....జ్యోతిషం చెప్పువారందరూ ఉన్నత కులజులే అందరూ మోసగాళ్ళే....జ్యోతిషమే ఒక మోసం....అది ఉన్నత కులజులే చేస్తున్న మోసం..సమాజంలోని ఇతరులంతా మోసపోతున్నవారే...వారంతా పచ్చపూసలే.

  చిలక జోస్యం చెప్పువారంతనూ ఉన్నతకులజులే
  బుడబుక్కలవారు జొస్యం చెప్పేవారు ఉన్నత కులజులే
  రోజూవచ్చే జంగమదేవరలు జోస్యం చెబుతారు వారందరూ ఉన్నత కులజులే
  కోయదొర కొండదొరలంతా ఉన్నత కులజులే
  మసీదులవద్ద,గుడుల బయట, చర్చిల దగ్గర తాయత్తులమ్మువారందరూ ఉన్నత కులజులే
  రంగురాళ్ళను తవ్వించి, అవి ధరిస్తే గొప్పవారైపోతారని ప్రచారం చేయువారందరూ ఉన్నత కులజులే
  ఈ ఉన్నత కులజులందరిని కఠినంగానే శిక్షించాలి...మా ప్రభుత్వం వస్తే శిక్షిస్తాం...మీ వోటు మాకే...

  రిప్లయితొలగించండి
 4. అలాగే రోడ్డు ప్రక్కన కూర్చుని వేరుముక్కను సంజీవనిలా చూపించే వారి మాటేమిటి?
  అయినా ఏమార్చే మాటలు చెప్పడానికి కులం ఏమిటి? శాస్త్ర పాండిత్యం ఏమిటి? వాక్చాతుర్యం చాలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దారిన పోయే వారిని దురాశాజీవుల్ని బోల్తా వేస్తూ కొందరు మోసకారి జోస్యులు ఏవేవో వేరు ముక్కలు అంటగడుతూ సొమ్ములు గుంజుతూ ఉన్నారు.

   దారి వెదుక్కుంటూ వచ్చిన వారిని ఆశాజీవుల్ని బోల్తా వేస్తూ కొందరు మోసకారి డాక్టర్లు ఏవేవో వైద్యాలపేర వేలూ లక్షణాలూ బిల్లులు వేస్తూ సొమ్ములు గుంజుతూ ఉన్నారు.

   ఒకరి వాక్చాతుర్యం అశాస్త్రీయం. మరొకరిది శాస్త్రీయం.

   ఇదీ సంగతి.

   తొలగించండి
 5. ఇక్కడ పోస్ట్ వ్రాసిన బ్లాగర్ మరియు కమెంట్స్ వ్రాసిన వ్యాఖ్యాతలూ అగ్రకులజులమని భావిస్తున్నట్లని అనుకోవాలంటారా ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ బ్లాగరు ఏమని తనగురించి భావిస్తున్నాం డన్నది ముఖ్యమైన విషయం కాదు. టపాలోని విషయం మాత్రమే చర్చనీయం. వ్యాఖ్యాతల కులాల ప్రసక్తి అసంగతం.

   తొలగించండి
 6. గుమ్మడికాయ దొంగలు అగ్రకులజులంటే మీరు ఎందుకు టపా కట్టారో తెలుసుకోవచ్చా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నీహారిక గారూ, ఈటపాను వ్రాయటానికి కారణమైన చర్చను ఉటంకించటం‌ జరిగింది. అది మీరు గమనించే ఉంటారు. ఇకపోతే అగ్రకులజులైనంత మాత్రాన దొంగలు అని అనుకుంటామంటే అలా అనుకొనే వారితో వాదన అవసరం లేదు. అలా అనుకొనే వారు తప్పకుండా అలాగే అనుకోవచ్చును. మీరు "గుమ్మడికాయ దొంగలు" అనటం ద్వారా నన్ను ప్రశ్నిస్తున్న విషయం, నేను కూడా యాదృఛ్ఛికంగా అగ్రకులజుణ్ణి కావటం‌ ఈటపా వ్రాయటానికి కారణమా కాదా అన్నది అనుకుంటున్నాను. మీరు అవును అన్న అభిప్రాయాన్ని కనుక కలిగి ఉంటే, నిజంగా మీకు నా సమాధానంతో‌ పని ఉన్నదని అనుకోను. నేను కాదన్నంత మాత్రాన మీ అనుమానం తొలగిపోతుందని అనుకోను. నేను కేవలం సదరు చర్చను గురించి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయటానికి మాత్రమే టపా వ్రాసాను. నా అభిప్రాయం నా కులం కారణంగా ఏర్పడింది కాదు. నామాటను విశ్వసించటం‌ మానటం‌ మీ యిష్టం.

   తొలగించండి
 7. జ్యోతిషం శాస్త్రీయమా కాదా, మానవ బలహీనతలను అమ్మకందార్లు ఆసరాగా చేసుకోవడం, కుల వ్యవస్థ వంటి వాటి జోలికి పోకుండా రెండు మౌలిక విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను.

  1. మనుషులు వైద్యుల వద్దకు వెళ్లే అతిముఖ్యకారణం రుగ్మత. అనగా ఇక్కడ ప్రధాన విక్రయ వస్తువు సమస్యాపరిష్కారం. ఎవరయినా "నాకు తల నొస్తుంది, తగ్గించండి" అని అడుగుతారు, "నా తలనొప్పి తగ్గుతుందా" (లేదా "ఎప్పుడు/ఎట్లా తగ్గుతుంది") అనేది ప్రాధమిక విషయం కాదు. సమాచారం/కుతూహలం అన్నది ఈ వ్యాపారంలో సహ-ఉత్పత్తి లేదా ద్వితీయ ప్రాధాన్య వస్తువు మాత్రమే. జోస్యంలో మిగిలినవి ఏమీ లేవు: సమాచారం ఒక్కటే కొనుగోలు.

  2. వైద్య విధానంలో వ్యవస్తీకృత భద్రతా జాగ్రత్తలు & దిద్దుబాటు ప్రక్రియలు (second opinion, audit trail etc.) అంతర్లీనంగా ఉన్నాయి. సంప్రదాయ మౌఖిక "శాస్త్రాలలో" ఇవి ఉంటే ఉండవచ్చును గాక కానీ formal & structured స్థాయి మాత్రం కాదు.

  పై రెండు విషయాలను కూడా పరిగణనలో తీసుకొని పునర్దర్శిస్తే దృక్కోణం వేరేగా ఉండవచ్చును.

  PS: sorry for my poor verbalization of the conceptual elements

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 1. రోగులో రోగుల అంతేవాసులో రోగం తగ్గుతుందా ఎట్లా, ఎన్నాళ్ళకి వంటి ప్రశ్నలు వేయటం సాధారణమే. రోగాని మందు సూచించి తగ్గించండి అన్నట్లే సమస్యకు నివారణ సూచించి పరిష్కరించండి అని అడుగుతారు. పెద్దగా తేడా లేదు.
   2. జ్యోతిషం కూడా వ్యవస్తీకృత భద్రతా జాగ్రత్తలు & దిద్దుబాటు ప్రక్రియలను ప్రస్తావిస్తుంది. సలహా యిచ్చేవారి సమర్ధత, పుచ్చుకొనేవారి ఆచరణశీలత అన్నవి అవి యెంతవరకూ ఫలిస్తాయని నిర్ణయిస్తాయి.

   మనం చూసే దృక్కోణం చాలా ముఖ్యమే. ఆయుర్వేదాన్ని మాత్రమే విశ్వసించేవాళ్ళలో అల్లోపతీ పట్ల కూడా ఇలాంటి ప్రశ్నలు ఉండవచ్చును.

   తొలగించండి
  2. గురువు గారూ,

   నేను కాన్సెప్షువల్ ఆలోచనలను తెలుగులో సరిగ్గా దించలేను కాబట్టి పై వ్యాఖ్య కొరకు షానా ఇబ్బంది పడ్డాను. ఇప్పటికీ నేను చెప్పదలిచింది కుదిరిందా లేదా నాకే సందిగ్ధం. మిమ్మల్ని నా తిక్క భాషతో కష్ట పెడితే మన్నించండి.

   The subjects I tried to bring to notice are:

   - Are the products similar in composition, profile, liability & warrants?
   - Is the degree of process formality (e.g. systemic checks, foundation of "first principles", idiot proofing, fail safe) comparably mature in both systems?

   Note: The second bullet stresses both Quality (ability to meet requirements) and Quality Assurance (ability to provide confidence that requirements are & have been met).

   జ్యోతిషం గురించి తెలువదు కాబట్టి సమాధానం శోధించడానికి కావాల్సిన కనీస అర్హతలు నాకు లేవు. మీ దృష్టికి ఈ ప్రశ్నలు చేర్చడమే నా ఉద్దేశ్యం.

   My comment is only as a food for thought for the experts possessing the requisite subject matter knowledge.

   తొలగించండి
 8. జ్యోతిషం అంటే చిన్న కత బ్లాగుల్లో జరిగిందే గుర్తొచ్చింది,అవధరించండి. ఇది 2009=11 మధ్య జరిగింది. ఒక హేతువాద బ్లాగరికి మరొకరికి మధ్య జ్యోతిషం మీద ఒక చర్చ చాలా ఘాటుగా జరుగుతోంది. ఆ సందర్భంగా హే.బ్లాగరుగారు ఒక కాగితం ఫోటో తన చేత్తో పట్టుకున్నదానిని బ్లాగులో పెట్టేరట. ఆ చేతిని చూసి జూం చేసి మరొకరు హే.బ్లాగరుగారిని హెచ్చరించారట. అయ్యా! తగవు తరవాత చూసుకుందాంగాని మీరు అర్జంటుగా వైద్యుని కలవండీ అని దాని సారాంశం. హే.బ్లాగరు గారు దాన్ని తేలిగ్గా తోసిపారేశారు. ఆతరవాత మూడు నెలల అన్నీ ఐపోయినట్టు బందుగులు టపా పెట్టేరని..లీలగా గుర్తు.. ఈ సంఘటన పూర్తి వివరాలు తెలిసినవారు చెప్పచ్చు.

  బ్లాగులో జరుతున్న చర్చ కు సంబంధించి వ్యాఖ్య కాదు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆసక్తికర కథనం. 2010 మధ్య నుండి బ్లాగు ప్రపంచంలో ఉన్నాను. అంతకు ముందు సంఘటన కావచ్చును. నాకైతే తెలియదు. తెలిసిన వారు పరిశీలించి అవసరం అనుకుంటే చెప్పవచ్చును.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.