12, జులై 2020, ఆదివారం

నలుగురు మెచ్చితే నాకేమీనలుగురు మెచ్చితే నాకేమీ ఆ
నలుగురు నవ్వితే నాకేమీ

కలనైన రాముని ఘనతనే పాడెద నీ
యిలమీద రామునే యెంచి పొగడెద
వలచి నా రామునే భావించుచుందును
తిలకించువా రెట్లు తలచితే నేమి

స్తవనీయుడగు రామచంద్రుని విడిచి నే
నవికోరి యివికోరి యన్యుల పొగిడు
నవినీతుడ కానేర  నది నా విధానము
భువిని నా కితరుల బుధ్ధితో పనేమి

హరి భక్తి నాయదృష్ట మని నా నమ్మకము
పరులు వేరుగ నెట్లు భావించ నేమి
తిరమైన నా బత్తి దేవుడే యెరుగు
యెరుకలేని వారెట్టు లెరిగిన నేమి