18, జులై 2020, శనివారం

గడుసు పూజ!


తే। దేవుడా నీకు దండంబు దేవతార్చ
నా గృహంబున మాత్రమే‌ నళిననయన
కూరుచుండుము నిన్ను తోడ్కొనుచు బోవ
వీలుపడ దేను పోయెడు వీధులందు.

తే। ఉదయమే వచ్చి యొకపూవు నుంచి నీకు
చేయుదును నమస్కారమున్ చింతవలదు
మరియు నంతకు మించి సన్మామునకు
నాశ పడకుము నాశక్తి యంతవరకె

ఉ। వట్టి నరాధముండనని భావన సేయకు మయ్య భక్తి లేక కా
దెట్టుల నీకు తృప్తి యగు నించుక యేని నెఱుంగ దేవుడా
గట్టిగ నొక్క మంత్ర మనగా సరిగా పలుకంగ లేను నన్
తిట్టకు మయ్య పూజయని దీనిని చేకొను మయ్య వేడ్కతో

ఆ.వె।  ఒక్క పూవు నిచ్చి యొక్క దండము పెట్టి
చేసినట్టి పూజ చిత్తశుధ్ధి
నరసి నీవు మురిసి యన్ని వేళల నేను
కోరినట్టి వెల్ల కురియవయ్య

కం। ఇంతకు మించి వచింతునె
యెంతైనను నీవు భక్తి నెంచదవు కదా
సంతోషముగా నుండుము
సంతోషము నాకు గూడ సమ్మతి నిమ్మా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.