13, జులై 2020, సోమవారం
తారకనామము చేయండీ
తారకనామము చేయండీ సంసారసముద్రము దాటండీ
నారాయణుని చేరువిధానము నమ్మకముగ నిదియేనండీ
తీరికూర్చుని కబురులాడుచు తిరుగుచు కాలము గడిపెదరా
నేరము లెంచుచు పొరుగువారిలో నిత్యము కాలము గడిపెదరా
చేరి కొలిచినను మెచ్చని కుజనుల సేవల కాలము గడిపెదరా
ఊరక ధనములు ప్రోవులుపెట్టెడు నూహల కాలము గడిపెదరా
హరి సర్వాత్మకు నచ్యుతు నభవుని యంతరంగమున తలచండి
సురసేవితుడగు శ్రీరఘురాముని శోభనమూర్తిని తలచండి
పురుషోత్తముని భక్తులందరకు మోక్షము కలదని తలచండి
మరలపుట్టుట మరలచచ్చుటను మాటే వలదని తలచండి
యువకులు వృద్ధులు నువిదలు పురుషుల కుచితం బిదియని తెలియండి
అవిరళముగ హరి నామము చేయుట కందరర్హులని తెలియండి
పవళులు రేలును తారకనామము వదలరాదని తెలియండి
శివుడీ తారకనామము నెప్పుడు చేయుచుండునని తెలియండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.