4, జులై 2020, శనివారం

ప్రభవించుటే తప్పు వసుధపై నరుడు


ప్రభవించుటే తప్పు వసుధపై నరుడు
విభుని మరచి యుంట వేరొక్క తప్పు

సిరులకై యాశించి చెడుటొక్క తప్పు
చిరకాల ముండునా చెడిపోక తను వని
గురుతించక ఎగిరి కూలుట తప్పు
నరహరీ చూపవే కరుణ యిసుమంత

ఆలుబిడ్డల కంగలార్చుట తప్పు
మేలైన సౌఖ్యాలు మేని కెంతద్దినా
కాలమోర్వమి తెలియజాలమి తప్పు
కాలాంబుదశ్యామ కరుణించ వయ్య

శ్రీరామనామము చింతించుమన్న
ప్రారబ్ధమున జేసి పతితుడై తాను
చేరి పరుల సేవ చేయుట తప్పు
కారుణ్యమూర్తివై కాపాడ వయ్య


1 కామెంట్‌:

  1. చీ చీ నరులదేటి జీవనము - అని అన్నమయ్య చెప్పిన మాట నిండు నిజం.

    పాప కర్మలు కొండంత పుణ్య కర్మలు రవంత చేయక ఉండలేము. పుడుతూ చస్తూ బతుకు చక్రం లో బందీలమై బయట పడలేము.

    గాడిద కేమి తెలుసు గంధము చెక్కల వాసన అన్నట్టు మీరు వ్రాసే కీర్తనల విలువ సంస్కార హీనులు ఎరుగలేరు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.