18, జులై 2020, శనివారం

వరవరరావు గారు దయార్హులా?

ఈ రోజున ఒక వార్త చూసాను అది వరవరరావు గారికి సంబంధించినది. ఈనాటి ఆంధ్రజ్యోతి ఆన్‌లైన్ పత్రికలో అది వరవరరావు నాకు రాజకీయ గురువు: కరుణాకర్‌రెడ్డి అనే‌ శీర్షికతో‌ లభిస్తున్నది. ఈ వార్తాకారుడు సదరు వార్తను లిఖిస్తూ "ఈ లేఖ ఎవరినైనా కదిలించేలా ఉంది." అని వాక్రుచ్చారు.

అవును. నిజమే. ఇంతవరకూ విరసం‌నాయకుడు వరవరరావు గురించి కాని అసలు విరసం అనబడే సంస్థ గురించి కాని నేను ఎన్నడూ ప్రస్తావించలేదు నా బ్లాగులో. ఈ లేఖ నన్నూ‌ వ్రాసేలా కదిలించింది కదా. అందుకే‌ ఆ వార్తాకారుడు అన్నది నిజం అంటున్నది.

సమగ్రత కోసం, కేవలం ఈవ్యాసం‌యొక్క సమగ్రత కోసమే సదరు వార్తావ్యాసాన్ని యథాతధంగా ఇక్కడ ముందుగా చూపుతున్నాను.

విరసం నేత వరవరరావును కాపాడాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి లేఖ రాశారు. ఎమర్జెన్సీ సమయంలో వరవరరావుతో తనకున్న అనుబంధాన్ని లేఖలో గుర్తుచేశారు. ఎంతో బరువెక్కిన హృదయంతో రాసినట్లు అనిపిస్తున్న.. ఈ లేఖ ఎవరినైనా కదిలించేలా ఉంది.‘‘

వరవరరావు నిర్బంధం, అనారోగ్యం గురించి మీకు తెలిసే ఉంటుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఆయన బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోంది. 48 సంవత్సరాల క్రితం నాలో రాజకీయ ఆలోచనల అంకుర్భావ దశలో నాకు లభించిన ఎందరో గురువులలో ఆయనా ఒకరు. నలభై‌ ఆరు సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు, నేను ఇరవై ఒక్క నెలలు ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఆయన మన సహచరుడు. సాహచర్యం భావజాలంలో కాదు గానీ, కటకటాల వెనుక కలిసి ఉన్నాము, రాజకీయ సిద్ధాంతంలోనూ, జనక్షేమంకై నడిచే మార్గంలోనూ ఎవరి భావాలు వారివే. కానీ మనం మనుషులం. శరీరం మంచానికి కట్టుబడే 81 సంవత్సరాల వయసులో, అందులోనూ అనారోగ్యంతో ఉన్న ఆయనపైన ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది. యాభై మూడు సంవత్సరాలుగా అడవులలో ఆయుధాలు పట్టుకుని తిరిగే సాయుధులు సాధించలేని విప్లవం మంచం పట్టిన వృద్ధుడు సాధించగడా ?. ఈ స్థితిలో ఆయన ఇంకా నిర్బంధంలో ఉంచడం అవసరమా? రాజకీయాలతో సంబంధం సంబంధం లేకుండా మానవాళి మంచికి ఎన్నో కార్యక్రమాలు చేసిన మీరు దయతో ఆలోచించండి. రాజ్యం ఇంత కాఠిన్యమా, న్యాయం ఇంత సుదూరమా అని ఏ మేధావి ఈ దేశంలో భావించకూడదు. అహింసయే పరమ ధర్మం, శత్రువులు సైతం క్షమించాలి, వేదాంత వారసత్వ భారతదేశపు ఉప రాష్ట్రపతి అయిన మీరు... వరవరరావు విడుదల విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని సజల నయనాలతో విన్నవించుకుంటున్నాను. అనారోగ్యంతో అడుగులు తడబడుతూ నిస్సహాయంగా ఉన్న ఓ సిద్ధాంతం నిబద్ధ వృద్ధుడిని ప్రజాస్వామ్యవాదులులైన మీరు సానుభూతితో కాపాడమని కోరుకుంటున్నాను’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు.



ఇప్పుడు ఈ పైన చెప్పబడిన లేఖ గురించి నా అభిప్రాయాలు వ్రాస్తున్నాను. ఒకవేళ ఈ లేఖయే అసత్యం‌ ఐన పక్షంలో ఈ వ్యాసం అనవసర ప్రయాస అవుతుంది.

"శరీరం మంచానికి కట్టుబడే 81 సంవత్సరాల వయసులో, అందులోనూ అనారోగ్యంతో ఉన్న ఆయనపైన ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది." అన్న వాక్యం చదివారా? వృధ్ధుడైన కారణంగానూ, అనారోగ్యంతో ఉన్న కారణంగానూ ప్రభుత్వం‌ ఆయన పైన దయ చూపాలని అంటున్నారు. గత యాభైమూడు సంవత్సరాల కాలంలో అడవుల్లో నుండి సాయుధవిప్లవం నడిపించిన యోధులు ఎంతో‌ మందిని చంపారు. వారిలో వృధ్ధులూ అనారోగ్యంతో ఉన్నవారూ‌ లేరా? ఎన్నడైనా సరే ఆ విప్లవకారులు దయ అన్నది ఎవరిపైన ఐనా చూపించారా? వారు ఎవరినైనా చంపటానికి పెద్దగా కారణం ఎప్పుడూ అవసరం పడలేదు కదా. కేవలం విప్లవవ్యతిరేకులనో పోలీసు ఇన్ఫార్మర్లు అనో మరొకటనే అనుమానం కొంచెం వచ్చినా చాలు. అవతలి వ్యకి ఎంత అవధ్యుడు ఐనా సరే చచ్చినట్లు చావవలసిందే‌. అంతే‌ కద. ఎన్నడూ అలాంటి దయలేని కిరాతక విప్లవహత్యలను ఖండించని వాడూ పైగా ఆ హత్యలకు సిధ్ధాంతాల ముసుగులు వేసి సమర్ధించే సంస్థకు చెందిన వాడూ, నాగరికసమాజంలో రచయిత ముసుగులో ఆయుధమున్ ధరింప అని కగ్గముగా నొకపట్ల ఊరకే సాయము సేయువాడ అన్నట్లు అడవివీరుల పక్షాన పనిచేసి చేసి జైలు పాలైన పెద్దమనిషి పట్ల ప్రభుత్వం‌ ఎందుకు దయ చూపాలి? ఆయన ఎప్పుడన్నా కొంచెం విచక్షణా దయా చూపమని తమ విప్లవవీరులకు సందేశం ఇచ్చారా నిజాయితీగా?


"ఈ స్థితిలో ఆయన ఇంకా నిర్బంధంలో ఉంచడం అవసరమా?" ఎన్నడైనా విచక్షణా దయా అనేవిలేకుండాఏదో ఒక ముద్రవేసి కిట్టనివారిని విప్లవంపేరిట అక్షరాలాహత్యలుచేయటం అవసరమా అని ఈమేథావి వరవరరావుగారు తమ విప్లవమిత్రుల్ని ప్రశ్నించారా నిక్కచ్చిగా నిజాయితీగా? వ్యతిరేకుల్ని ఎలాగన్నా ఎంత క్రూరంగా అన్నా చంపటం సబబే అన్న విప్లవవిధానం సరైనదే ఐన పక్షంలో రాజ్యం కూడా అటువంటి దయారహితుల్ని ఎంతకాలం అంటూ కనికరం చూపకుండా కఠిన నిర్భంధంలో ఉంచటం అత్యవసరమే అని వేరే చెప్పాలా?


"రాజ్యం ఇంత కాఠిన్యమా, న్యాయం ఇంత సుదూరమా అని ఏ మేధావి ఈ దేశంలో భావించకూడదు." చక్కటి అభిప్రాయం. తప్పకుండా ఒప్పుకోవలసిందే. ఏకాఠిన్యాన్నీ అన్యాయాన్నీ కుంటిసాకులకు హతమారిపోయిన మనుష్యుల పట్ల ఎంతమాత్రం చూపని వారిపై రాజ్యం ఎందుకని మృదువుగా వ్యవహరించాలి? అటువంటి వారికి మిక్కిలిగా సత్కారం చేసి వారుకోరిన న్యాయం అందించాలని రాజ్యం‌ఎందుకు ఆలోచించాలి? రాజ్యపౌరులపట్ల అది ద్రోహం కాదా? తమని నిష్కారణంగా కూడ చంపిపారేసే వ్యక్తుల్నీ వారికి సైధ్ధాంతిక నైతిక రాజకీయ సామాజిక మద్దతును అందించే వారిని దయగా చూడటం‌ అంటే రాజ్యప్రజలను ప్రమాదంలో బ్రతకమని చెప్పటం‌ కాదా? అదెలా సమర్ధనీయం?

"అహింసయే పరమ ధర్మం, శత్రువులు సైతం క్షమించాలి" అహా ఎంతటి గంబీరోపదేశం. ఇక్కడ ఒక చిన్న పొరపాటు దొర్లింది. నిజానికి లేఖకుని ఉద్దేశం‌ "అహింసయే పరమ ధర్మం, శత్రువును సైతం క్షమించాలి" అని సులభంగానే తెలుస్తున్నది. హింసయే పరమధర్మం. శత్రువును ఎలాగైనా చంపితీరవలసిందే అని నిత్యం‌ జపించే వారిని సమర్ధించే వ్యక్తి పట్ల ఈ‌ మహోపదేశాన్ని ఎలా అమలుచేయటం? "తుపాకి గొట్టం నుండే రాజ్యాధికారం వస్తుంది" అన్న నినాదం మనసా వాచా కర్మణా నమ్మే వారికి సైధ్దాంతిక గురుస్థానంలో ఉన్నారు కదా ఈ విరసం వారూ వారి తాలూకు వరవర రావు గారూను? అందుచేత ఈ గంభీరధర్మపన్నాలు వారి పట్ల వర్తింప జేయరాదు. చేయరాదు కాక చేయరారు. భారతంతో శ్రీకృష్ణుడు నిర్వచించిన ఆతతాయిలు అనే‌ పరిధిలోని వారు ఈ విప్లవకారులూ వారి తాలూకు వారూను. నిష్కారణంగా హత్యలకు తెగబడే వారు ముమ్మాటికీ ఆతతాయిలే. ఆతతాయిలు వేరే యితరకారణాల వలన అవధ్యులు ఐనా సరే, ఆతతాయిలు కాబట్టి అవశ్యం వధ్యులు. అశ్వత్థామ అందుకే బ్రాహ్మణుడూ, గురుపుత్రుడూ, తపస్వీ కూడా ఐనా సరే వధ్యుడైనాడు. అందుచే వృధ్ధుడు, అనారోగ్యవంతుడూ, మేథావి వంటి సాకులు వరవరరావు పట్ల దయనూ అహింసనూ చూపటానికి ఎంతమాత్రమూ ప్రాతిపదికలు కావు. సరే అయన స్వయగా తుపాకీ పుచ్చుకొనీ‌ కత్తిపుచ్చుకొనీ‌ హత్యలు చేయలేదంటారా? నివారణదక్షుడై కూడా అటువంటి హత్యలను ఉపేక్షించాడు, పైగా ప్రోత్సహించాడు. శ్రీకృష్ణుడు సారపు ధర్మమున్ అన్న పద్యంలో చెప్పినట్లు "దక్షు లెవ్వార లుపేక్ష సేసిరది వారల చేటగు" అన్నది సత్యం. అందుచే వరవరరావు గారు దయాపాత్రులు కానేకారు.

"అనారోగ్యంతో అడుగులు తడబడుతూ నిస్సహాయంగా ఉన్న ఓ సిద్ధాంతం నిబద్ధ వృద్ధుడిని ప్రజాస్వామ్యవాదులులైన మీరు సానుభూతితో కాపాడమని కోరుకుంటున్నాను". ప్రజాస్వామ్య వారులైన వారు ఆ ప్రజాస్వామ్య‌ం‌పట్ల కించిత్తు నమ్మకం కూడా లేని వారిని దయచూడాలి అన్న మాట ఒకటి వినటానికి బాగుంది. నిజంగా హత్యలు చేస్తున్నప్పుడు తాము హత్యచేస్తున్న వారు తమ వృత్తినిబధ్ధతో పోలీసుపని చేస్తున్నవారైనప్పుడు ఇలా ఆలోచించి ఎన్నడైనా వారిని కాపాడాలని దయతో ఆలోచించారా ఈ విప్లవం వాళ్ళూ వాళ్ళ విరసం గురువులూ? ఎన్నడూ అనారోగ్యంతో‌నో‌ మరొక కారణంగానో‌ నిస్సహాయంగా ఉన్నవారిని వీళ్ళు దయాదాక్షిణ్యాలు చూపి చంపకుండా వదిలారా? లేదే?

"రాజకీయ సిద్ధాంతంలోనూ, జనక్షేమంకై నడిచే మార్గంలోనూ ఎవరి భావాలు వారివే" అంటూ వరవర రావు గారు కూడా జనక్షేమం‌కోసం నడిచిన వారని సెలవిచ్చారు. ఈ విప్లవమార్గం జనక్షేమం కోసం ఐన పక్షంలో అది ఎటువంటి జనక్షేమ‌ం‌ చెప్పండి? తుపాకీ గొట్టం ద్వారానే వాళ్ళు రాజ్యాధికారం సంపాదించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. ఇక్కడ జనం‌ కాని జనక్షేమం ప్రసక్తి కాని లేదు. తమ మార్గంలో నడిచే వారూ, తమ మార్గానికి అడ్డురాని వాళ్ళూ, తమ మార్గానికి అడ్డువచ్చే వాళ్ళూ‌ అని వారి దృష్టిలో జనం మూడు తెగలు. ఆ మూడో రకం‌ జనం, అంటే అడ్డు వచ్చే వాళ్ళ పట్ల వారి సిధ్ధాంతం చెప్పే విధానం అటువంటి వారిని ముళ్ళపొదల్లాగా నరికి పారెయ్యటమే. ఇది సుస్పష్టమే. కర్మ కా వీరి తుపాకీలు వీరికి రాజ్యాధికారాన్నే ఇస్తే జరిగేది ఏమిటి? అప్పుడు అడ్డూ అదుపూ ఉంటుందా వీరికి? అడ్డు చెప్పే సాహసం ఎవరికైనా ఉండటం వీలే‌కాదు కదా? అప్పుడు వీరు రెండవరకం జనం‌ అంటే‌ తమకు వ్యతిరేకులు కాకపోయినా అనుకూలురు కూడా కాని వారి పనీ పడతారు. కేవలం తమకు అనుకూలురైన వారికే‌ బ్రతికే‌ హక్కు ఉంటుంది వారి రాజ్యంలో. ఈవిషయంలో డొంకతిరుగుడు ఏమీ‌ లేదు. కచ్చితంగా అదే నిజం. ఆపుడు వారు ఎవరిపైన ఐనా దయా దాక్షిణ్యమూ చూపుతారా చెప్పండి. నమ్మలేక పోతున్న వారి కోసం ఒక ఉదాహరణ. తియాన్మన్‌ స్క్వేర్‌ వద్ద చైనా విద్యార్థులను కమ్యూనిష్టు చైనా ప్రభుత్వం ఎలా పురుగుల్ని చంపినట్లు చంపి పారేసిందో గుర్తు తెచ్చుకోండి. ముక్కుపచ్చలారని పసివాళ్ళే అని అక్కడి కమ్యూనిష్టు ప్రభుత్వం వా కనికరం ఏమన్నా చూపారా? విప్లవం లేదా కమ్యూనిజం‌ లెక్క ప్రకారం వ్యతిరేకులు అందరూ వర్గశత్రువులు - వావటం తప్ప వారికి మరొక నిష్కృతి లేదు. వారికి మరొక శిక్షలేదు. అక్కడ దయాదాక్షిణ్యాలు లేవు. విచక్షణ అన్న మాట ఊసే లేదు. ఇప్పుడు ఆలోచించండి. ఇటువంటి ఆతతాయి సంస్థలకు చెందిన వ్యక్తులపైన ధర్మం పేర అహింస పేర దయాదాక్షిణ్యాలు చూపటం పాములకు పాలు పోయటం మాత్రమే అవుతుంది కదా.

నాకు వరవర రావు గారితోగాని, కరుణాకర్ గారితో గానీ వ్యక్తిగతంగా పరిచయం లేదు. వ్యక్తిగత రాజకీయ శత్రుత్వ మిత్రత్వాల వంటివేమీ లేవు. కేవలం ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి నా అభిప్రాయం వ్రాసానంతే.