12, జులై 2020, ఆదివారం

రవిచంద్రవిలోచన రామ పాహి


రవిచంద్రవిలోచన రామ పాహి భక్త
భవపాశవిమోచన పాహి పాహి

కాలము కబళించరాని ఘనకీర్తి కలవాడ
మేలైన గుణములు మెండుగా గలవాడ
నేలకు దిగివచ్చిన నీలమేఘశ్యాముడ
ఏలుకోవయ్య వేగ ఇందీవరాక్షుడ

రావణు నణచిన రణనీతికోవిదుడ
భూవలయపాలకుడ పురుషపుంగవుడ
మా వలని తప్పులను మన్నించెడు వాడ
కావవయ్య వేగమె కరుణాసముద్రుడ

సీతాసమేతుడ చిన్మయాకారుడ
ప్రీతి భక్తకోటి నేలు వీరరాఘవుడ
చేతులెత్తి మ్రొక్కేము చిత్తజగురుడ
ఏతీరున నైన రక్షించవలయు నయ్య