15, జులై 2020, బుధవారం

ఏమి చెప్ప మందువయ్య భగవంతుడాఏమి చెప్ప మందువయ్య భగవంతుడా శ్రీరామునికథ చిత్రమాయె భగవంతుడా
నా మనసిది దాని నెన్ని భగవంతుడా వాడు నావాడని గర్వించు భగవంతుడా

శ్రీమహావిష్ణువేమి భగవంతుడా తనకు చింతలు కడగండ్లేమి భగవంతుడా
రాముడై మనిషివలె భగవంతుడా తాను కోమలికై యేడ్చుటేమి భగవంతుడా

పట్టాభిషేకవేళ భగవంతుడా కైకవచ్చి చెడగొట్టుటేమి భగవంతుడా
పట్టరాని క్రోథమును భగవంతుడా అన్న వంకజూచి యణచితిని భగవంతుడా

దాసపోషకు డేమి భగవంతుడా వనుల దైన్యమును పొందుటేమి భగవంతుడా
కౌసల్యా సుతుడేమి భగవంతుడా తాను కారడవుల నుండుటేమి భగవంతుడా

పంక్తిరథుని కొడుకేమి భగవంతుడా వాడు బన్నములు పడుటేమి భగవంతుడా
పంక్తికంఠు డెవ్వడయ్య భగవంతుడా మాకు వాని తోడ వైరమాయె భగవంతుడా

బంగారులేడి యేమి భగవంతుడా అది ముంగిటికి వచ్చుటేమి భగవంతుడా
చెంగుచెంగున యెగిరి భగవంతుడా అది సీతమ్మను మురిపించెను భగవంతుడా

దనుజుల మాయ యని భగవంతుడా నేను తలబాదుకొన్న వినదాయె భగవంతుడా
తన ముచ్చట చెప్పి వదిన భగవంతుడా విభుని దానిని తెమ్మన్నదో భగవంతుడా

రాకాసుల మాయ యని భగవంతుడా మా రాముడైన యెఱుగడేమి భగవంతుడా
చేకొని కోదండము భగవంతుడా అతడు శీఘ్రముగ పరువెత్తెను భగవంతుడా

అది రాముని చేజిక్కి భగవంతుడా అంత హాసీతా యనుచు జచ్చె భగవంతుడా
వదిన విని భీతి చెంది భగవంతుడా నన్ను పతి వద్దకు పంపుటేమి భగవంతుడా

ఇది యును మాయ యంటె భగవంతుడా తల్లి యెన్ని కారు లరచినది భగవంతుడా
వదిన బాధ చూడ లేక భగవంతుడా నేను పర్ణశాల వీడవలసె భగవంతుడా

దనుజుడా సందుచూచి భగవంతుడా మా తల్లి నపహరించినాడు భగవంతుడా
ఇనకులేశు శోకమో భగవంతుడా చెప్ప నింతిం తనరాదయ్య భగవంతుడా

రావణుడే దొంగయని భగవంతుడా పక్షిరాజు జటాయువు చెప్పె భగవంతుడా
దేవేరి జాడకొఱకు భగవంతుడా అన్ని దిక్కుల గాలించితిమి భగవంతుడా

హనుమంతుడు సీతమ్మను భగవంతుడా తా నరసివచ్చె లంకలోన భగవంతుడా
వననిధి మధ్యలోన భగవంతుడా ఆ స్వర్ణలంక యున్నదాయె భగవంతుడా

కడలికి వారధి కట్టి భగవంతుడా వార్ధి గడచి లంక చేరినాము భగవంతుడా
దుడుకు రావణుని తోడ భగవంతుడా పెద్ద దొమ్మి చేయవలసి వచ్చె భగవంతుడా

తుదకు రావణుని జంపి భగవంతుడా అన్న తొయ్యలిని తిరిగిబడసె భగవంతుడా
ఇదియేమి టయ్యె ఓ‌ భగవంతుడా అన్న కేల నిట్టి కష్టములు భగవంతుడా

దుష్టులను సంహరించి భగవంతుడా అన్న దోర్భలము చాటినాడు భగవంతుడా
కష్టమెల్ల తీరినట్లె భగవంతుడా ఇదే గద్దె నెక్కె రామమూర్తి భగవంతుడా

దానవాంతకుడు హరి భగవంతుడా ఈ దశరథాత్మజు డంట భగవంతుడా
వాని లీల లెన్నగా భగవంతుడా మా వశము కాకుండు నయ్య భగవంతుడా