13, జులై 2020, సోమవారం

శ్రీవైకుంఠుని చిత్తశుధ్ధితో సేవించుటయే


శ్రీవైకుంఠుని చిత్తశుధ్ధితో సేవించుటయే పరమానందము
దేవదేవుని దివ్యత్త్వమును భావించుటయే‌ పరమానందము

హరి సర్వాత్మకు నచ్యుతు నభవుని యంతర్యామిని శ్రీకరుని
నరనాయకుని సురనాయకుని వరదాయకుని రాఘవుని
కరుణామయుని వారిజలోచను పరమోదారు గుణాకరుని
ధరణీతనయాహృదయేశ్వరుని దశరథనందను రాముని

దానవవిషవనదావానలుని ధర్మస్వరూపుని దాంతుని
మానవనాథకులాథిపు నిర్మము మరియాదాపురుషోత్తముని
జ్ఞానానందమయాకృతి నీశ్వరు సజ్జనగణసంసేవితుని
ప్రాణాధికుని పరమయోగిగణభావితమూర్తిని రాముని

కాలకాలవనజాసనసన్నుత కళ్యాణప్రదమూర్తిని
కాలాతీతుని మాయామానుషకమనీయశుభమూర్తిని
పాలితాఖిలభువనజాలుని పతితపావనమూర్తిని
నీలగగనఘననిరుపమసుందర నిర్మలమూర్తిని రాముని