17, జులై 2020, శుక్రవారం

ఎవరిని పొగడేరో యెందుకు పొగడేరో


ఎవరిని పొగడేరో యెందుకు పొగడేరో
భువిని రాముడొక్కడే పొగడదగిన వాడు
 
కొందరు బంధువులను గొప్పగ పొగడేరు మరి
బందుగుడన రామునంత వాడెవ్వడుండును
కొందరు ధనవంతులను గొప్పగ పొగడేరు కన
నందరి ధనములును నారాము డిచ్చినవే

కొందరు పండితుల గొప్పగ పొగడేరుమరి
యందరి పాండిత్యములు నారాము డిచ్చినవే
కొంద రధికారులను గొప్పగ పొగడేరు మరి
యందరి యధికారములు నారాము డిచ్చినవే

కొందరు గురువులను గొప్పగ పొగడేరు కన
నందరు గురువులును నారాముని యంశలే
కొందరు దేవతలను గొప్పగ పొగడేరు మరి
యందరు దైవతములు నారాముని యంశలే

3 కామెంట్‌లు:

  1. రోగాలు కూడా రాముడిచ్చినవేనాండీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వెటకారం అర్దమయింది. I am not born yesterday. కాని మీకు జవాబు తెలుసుకోవటం‌ మీద ఆసక్తి ఉండి ప్రశ్నించారని భావించలేకపోతున్నాను. ఎందుకంటే మీధోరణి బ్లాగులోకంలో నేను క్రొత్తగా చూస్తున్నది కాదు కదా. మీకు చర్చకు సందు ఇవ్వటం వలన మనస్తాపాన్ని కొనితెచ్చుకోవటం తప్ప మరేమీ మిగిలేదు కాదని తెలిసిందే.

      ఐనా మీ ప్రశ్నను ప్రచురించి, జవాబు చెప్పకపోవటం‌ భావ్యం కాదు కనుక చెప్తున్నాను. అవును అరోగ్యమైనా అనారోగ్యమైనా చివరికి మృత్యువైనా అది రామప్రసాదమే‌ అని రాగదృష్టి వదలినవారికి మాత్రం చక్కగా తెలుస్తుంది. ప్రారబ్ధ కర్మానుభవం‌ ఎవరికీ తప్పదు. పెద్దల అనుగ్రహమో దేవతల అనుగ్రహమో చివరికి దైవకృపయో ప్రారబ్ధకర్మానుభవాన్ని తొలగించదు కాని దానిని అనుభవించే‌శక్తిని ఇవ్వటం‌ కాని దాని తీవ్రతను తగ్గించటం కాని చేస్తుందంతే. ఎవరైనా పట్టుబడితే ఆకర్మానుభ్వాన్ని అవసరమైన సందర్భాల్లో మరుజన్మకి వాయిదా వేయగలదు కూడా. అంతకు మించి ఏమీ లేదు. ఆగామిసంచితాలను మాత్రం రహితం చేయగలదు, మనం అందుకు యోగ్యులమైతే. పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ బాధతే అని ఆర్యోక్తి. అది అనుభవించటం లేదా ప్రార్దన ద్వారా వీలైతే వాయిదావేసుకోవటం మాత్రం చేయగలం. ఒక్కోసారి సత్పురుషులకు అనేకబాధలూ రోగాలూ ఒక్కసారి చుట్టుముడతాయి. దాని అర్ధం వారికి దైవకృపలేక అని కాదు దైవకృపవలన ఎన్నో జన్మలపాటు అనుభవించవసినవన్నీ ఒక్కసారిగా అనుభవించి విముక్తులు కావటం కోసం కలిగిన దైవకృప అని. అలాగే‌ప్రకృతిపట్ల అపచారం చేసిన మానవాళి సంఘాతంగా అనుభవించవలసిన కర్మమూ తప్పదు. దైవకృపతో తీవ్రతను ఉపశమించేట్లు చేసుకోవచ్చును. మీకీ జవాబు ఎంతవరకూ‌ అవగతం అవుతుందో తెలియదు. దయచేసి ఈవిషయమై చర్చను పొడిగించవద్దని మనవి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.