12, జులై 2020, ఆదివారం

దినదినము దిగులాయె దీనత మెండాయెదినదినము దిగులాయె దీనత మెండాయె
నను కరుణించని ఘనుడవు నీవాయె

తనువు దుర్బలమాయె దానికి వయసైపోయె
మనసేమో చెడిపోయె మరి యది యలసిపోయె
మనికి దుస్సహమాయె మహాప్రభో రామ
ఉనికి యింక చాలునీ యుపాధికి నననాయె

మొదట బుధ్ధి లేదాయె ముందుచూపు లేదాయె
తుదిని చెడ్డ బ్రతుకాయె మెదుకు సహించదాయె
ముదిమి చాల బరువాయె మ్రొక్కెదను రామ
యిదిగో యీబ్రతుకు చాలు నింక నన్నటులాయె

తలపులన్ని నీవాయె తదితరములు చేదాయె
కలల నైన నీవాయె కడు హితుడ వైతి వాయె
పలుకు లన్ని నీకాయె పట్టాభిరామ
వలపు లేదైహికముల పైన నన్నటులాయె