2, జులై 2020, గురువారం

రాముని భజన చేయవె

రాముని భజన చేయవె సీతారాముని భజన చేయవె
కామితవరదుని మనసా కరుణాధాముని భజన చేయవె


సుజనుల బ్రోవగ నరుడై దశరథసుతుడై వెలసిన దేవుని
కుజనుల నణచి ధర్మము నిలిపిన గుణశీలుడు మన దేవుని
విజయ శీలుడై ధరపై వెలసిన వీరరాఘవ దేవుని
ప్రజలను బిడ్డల వలెపాలించిన భక్తవరదుడగు దేవుని


పదుగురి మధ్యను నిలచి యాడుచు పాడుచు చక్కగ వేడుచు
సదమల చిత్తముతో‌ పురుషోత్తము సత్కీర్తిని కొనియాడుచు
విదులను గూడి వివిధరీతులను వివరించుచు హరి సత్కథలు
మదిలో రాముం డొక్కని దక్క మరి యన్యులను తలపకను


నడచుచు కుడుచుచు ముడికొను పనులను నరుల తోడ భాషించుచును
పడకను చేరుచు రాముని నామము పరమభక్తితో‌ పలుకుచును
విడచుచు లౌకికములపై బుధ్ధిని విడువక రాముని పదములను
తడయక సర్వవిధంబుల రాముని తత్త్వమునే చింతించుచును 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.