3, జులై 2020, శుక్రవారం

దగాకోర్లూ‌ మోసగాళ్ళూ అందరూ ఉన్నత కులజులేనా?

మిత్రులు లక్కాకుల వెంకట రాజారావు గారి సుజన-సృజన బ్లాగులో జ్యోతిషానికి సంబంధించిన రసవత్తరమైన చర్చ ఒకటి నడుస్తున్నది. ఆసందర్భాన్ని పురస్కరించుకొని, నా అభిప్రాయాలను తెలియజేయటానికి ప్రయత్నిస్తున్నాను.

ఇక్కడ చర్చకోసం వైద్యరంగాన్ని కూడా కలిపి ప్రసంగిస్తున్నాను. అంతమాత్రం చేత ఆ వైద్యరంగం పట్ల నాకేదో ద్వేషం వంటిదేదో ఉందనో లేదా జ్యోతిషం పట్ల నాకు మితిమీరిన ప్రేమ ఉందనో భావించవద్దని మనవి.

రాజారావు గారు ఒక మాట అన్నారు, నమ్మకమే జ్యోస్యుల వ్యాపార పెట్టుబడి అని. వారి భావాన్ని ప్రత్యేకించి విశ్లేషించి చెప్పనవసరం లేదు. వారు సూటిగానే చెప్పారు. ఒకముక్క అడుతున్నాను. మనం హాస్పిటళ్ళచుట్టూ తిరుగుతున్నాం. ఒకప్పుడు ఇంత లేదు. ఇప్పుడు అంతా కార్పొరేట్ వైద్యం. ఫామిలీ డాక్టర్ అన్న పధ్ధతి లేకుండా పోయింది. ప్రతి చిన్న సమస్యకు కూడా స్పెషలిష్టు దగ్గరకు పరుగెడుతున్నాం. మళ్ళా కార్పొరేట్ హాస్పిటళ్ళలో వైద్యం పేర దోపిడీ జరుగుతోందనీ నిత్యం గోల పెడుతూనే ఉన్నాం. మరి ఆ దోపిడీ‌కి కారణం ఏమిటి? మన నమ్మకమే పెట్టుబడిగా ఆ హాస్పిటళ్ళు దోపిడీ చేయటం లేదా? అవసరం లేని టెష్టులు చాలా అవసరం అని ఆ హాస్పిటళ్ళలో డాక్టర్లు మనని నమ్మించటం లేదా? అవసరం ఏమాత్రం లేకపోయిన సందర్భాల్లో కూడా అతితరచుగా ఈమధ్య పేషంట్లని ఈ డాక్టర్ల చేత అక్షరాలా చెప్పించి మరీ ఐసీయూల్లో కుక్కటం లేదా ఈ కార్పొరేట్ హాస్పిటళ్ళు?  కాని మనం తొందరగా నమ్మకమే డాక్టర్ల వ్యాపార పెట్టుబడి  అనో నమ్మకమే హాస్పిటళ్ళ వ్యాపార పెట్టుబడి అనో‌ ఎందుకని అనటం లేదూ? ఎందుకంటే ఆధునిక విజ్ఞానం ఈ డాక్టర్లు వాడుతున్నారు కాబట్టీ ప్రాచీనమై తుప్పుపట్టిన జోస్యాన్ని జ్యోతిష్యులు వాడుతున్నారు కాబట్టీ కదా?

విన్నకోట నరసింహారావు గారు అన్నట్లు అంతావ్యాపారమయం ఐపోయింది. అలా జ్యోతిషాది పాత శాస్త్రాలే కాదు అధినిక వైద్యాది విజ్ఞాన శాస్త్రాలూ నేడు వ్యాపారమయం ఐపోయాయి. నిజం.

చాలామంది జ్యోతిషాన్నిఆధునిక వైద్యం ఎదురుగా నిల్చోబెట్టటాన్ని హర్షించలేక పోవచ్చును. కాని మనం ఏమనుకుంటున్నాం అన్నది అటుంచి జ్యోతిషం ఒక వేదాంగం. ఒక శాస్త్రం. మనం నమ్మినా నమ్మకపోయినా ఏశాస్త్రమూ‌ కూడా శాస్త్రం కాక పోదు.

పొట్టకూటి వేషగాళ్ళు చేరి భ్రష్టుపట్టించనిది ఏదన్నా శాస్త్రం ఉందా? అది సంప్రదాయిక వైదిక శాస్త్రాల్లో ఐనా, ఆధునిక విజ్ఞానశాస్త్రాల్లో ఐనా? అందుకే ఇక్కడ పోలికతెచ్చి విశ్లేషించి చూపటం. దయచేసి అర్ధం చేసుకోగలరు.

ఆధునికవైద్యశాస్త్రాన్ని సొమ్ములు సంపాదించుకొనేందుకే ఎక్కువగా వాడుకుంటున్నారా లేదా నేటి డాక్టర్లలో హెచ్చుమంది? అంత మాత్రాన ఆధునికవైద్యం బూటకం అని మనం అనలేం‌ కదా. కాని సుళువుగా పొట్టకూటి జోస్యులను చూపి జ్యోతిషశాస్త్రం బూటకం అనటంలో అంత న్యాయం లేదేమో అన్నది ఆలోచించాలి.

ఇద్దరు మంచి డాక్టర్లే ఐనా చేసే చికిత్సలో పైకి ఐనా తేడా ఉంటోంది కదా, అది మనం అర్ధం చేసుకుంటున్నాం‌ కదా సహజమే అని? కాని ఇద్దరు జోస్యులు విభిన్నమైన ఫలితాలు చెప్పినంత మాత్రాన అదిదో చూడండి జ్యోతిషం శాస్త్రం కాదు బూటకం అని వేరే ఋజువు కావాలా అనటంలో తొందరపాటుదనం ఉందేమో‌ అని కూడా ఆలోచించాలి.

ఆవలివాడి భయం అన్నది సొమ్ము చేసుకుందుకు లేదా భయపెట్టి మరీ ఆ భయం నుండి లాభపడటానికి ప్రయత్నించటం అన్నది తప్పుడు మనుషుల ఆలోచనావిధానం. అటువంటి విధానంలో జోస్యులు దిగ్విజయంగా బ్రతగ్గలిగితే వారిలో అత్యధికులు కోటీశ్వరుగా ఉండాలి. కాని అత్యధికులు ఏదో‌ పొట్టకూటికోసం జ్యోతిషాన్ని నమ్ముకొనే వారిగా ఉన్నారన్నది గమనించ దగిన సంగతి. అదే సమయంలో విజ్ఞులు మరొక విషయం గమనించగలరు. నేటి డాక్టర్లలో హెచ్చుమంది రోగుల భయపెట్టి మరీ‌ ధనసంపాదన చేస్తున్నారు. వారిలో అత్యధికులు దినదిన గండంగా యేమీ‌ బ్రతకటం లేదు.

భవిష్యత్తును ముందుగా తెలుసుకోవాలనుకోవడం దురాశ . ఈ‌ మాట తప్పక ఒప్పుకోవాలి. ఎంతో నిజం. ఒక జోస్యుడి దగ్గరకు వెళ్ళే సగటుమనిషి రాబోయే కాలంలో అన్నా కాస్త పరిస్థితులు మెరుగుపడతాయా అన్న ఆశతో వెళ్తున్నాడు కాని, రేపు ఎన్నిమేడలు కట్టబోతున్నానో అన్న దురాశతో వెళ్ళటం లేదు. నిజానికి అంతా బాగున్నప్పుడు ఎవడూ వైద్యుడి దగ్గరకూ వెళ్ళడు జోస్యుడి దగ్గరకూ వెళ్ళడు!

జోస్యుడిని ఎంత త్వరగా పరిస్థితులు మెరుగౌతాయీ అని అడుగుతాడు సగటుమనిషి. వాడే డాక్టరును జబ్బు ఎంత తొందరగా నయం అవుతుందీ అనీ అడుగుతున్నాడు. డాక్టరును అడిగినప్పుడు అది ఆశగానూ జోస్యుడిని అడిగినప్పుడు దురాశగానూ చెప్పవచ్చునా? అలా చూడటం సబబు కాదేమో అని యోచించ వలసింది.

రాజారావు గారు జ్యోతిష్యం నమ్మడం , కార్తాంతికులు నమ్మబలకడం మోసం ,దగా అని నిష్కర్ష చేసారు. నిజానికి ఎవరన్నా అసత్యపూర్వకంగా మరొకరిని నమ్మబలకటం ఎప్పుడూ దగా క్రిందకే వస్తుంది. ఆనమ్మబలికే వాడు కార్తాంతికుడైతే మాత్రమే కాదు అలాంటి వాడు కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ ఐనా సరే మనం మోసం దగా అనే అనాలి.

అన్నిరంగాల్లోనూ ఈ మోసం దగా ఉన్నదని మనకు తెలుసును. పిల్లలను మళ్ళా కార్పొరేట్ బళ్ళలో వేస్తున్నాం. వాళ్ళు లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. కాని అరకొర చదువులు చెప్తున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. అప్పుడు ఆ కార్పొరేట్ విద్యావ్యవస్థనిండా మోసం దగా ఉన్నదని మనం ఒప్పుకోవాలా లేదా?

నమ్మి ఓట్లు వేసాక రాజకీయవ్యవస్థలో జనానికి అందుతున్నది సాధారణంగా నమ్మకద్రోహాలే. అక్కడా మోసం దగా తప్ప మరేమీ లేదు. అదీ మనం ఒప్పుకుంటున్నాం.

ఇన్ని చోట్ల, మరిన్ని చోట్ల, నిజానికి అన్ని చోట్లా మోసం దగా వంటివి మాత్రమే చూస్తూనే కేవలం‌ పొట్టకూటి జోస్యులను మాత్రమే మోసగాళ్ళు దగాకోర్లు అని శపిస్తూ జ్యోతిషం అంతా హంబగ్ అనేయటం ఏమంత న్యాయమైన పనో మనం ఆలోచించవలసి ఉంది తప్పకుండా.

ఇంక ముగించే ముందు ఒక్క సంగతి మనవి చేయదలచుకున్నాను. అందరున్నత కులజులే అని తమ యీ టపాకు పేరు పెట్టారు రాజారావు గారు. అంత సబబుగా అనిపించలేదు నాకు. అలాగని వారి అభీష్టాన్ని అధిక్షేపించటం లేదు. వినయంగా ఒక్క మాట అడుగుతున్నాను.  రాజారావు గారు తమ పద్యాన్ని ముగిస్తూ "అంద రున్నత కులజులే , అందులోను శాస్త్ర పాండితీ ధిషణులే ,  చదువు నింత ఘనముగా వాడుచున్నారు కడుపు కొఱకు" అన్నారు. జ్యోతిర్విద్య కేవలం అగ్రవర్ణాలకే పరిమితం ఐనది కాదండీ. ఒకప్పుడు అలా ఉండేది అని అనుకున్నా, నేడు అందరికీ అందుబాటులోనే ఉంది. ఎందరో అగ్రవర్ణాలకు చెందని వారూ జ్యోతిష్యపండితులు ఉండవచ్చును. కేవలం అగ్రవర్ణాలవారు మోసం దగా కోసం జ్యోతిషం అనే‌ నాటకం ఆడుతున్నారని అని నిందించటం అంత ఉచితం అంటారా?  నేటి సర్వరంగాల్లోనూ నడుస్తున్న మోసాలూ దగాలూ కేవలం అగ్రవర్ణాలే చేస్తున్నాయంటే చెప్పగలగింది ఇంకేమో లేదు. కాని అది మానవుల దురాశ కారణంగా నడుస్తున్న వ్యవహారం అని అందరకూ తెలిసిందే. కేవలం అగ్రవర్ణాలను మాత్రమే నిందించటం అంత హర్షించలేక పోతున్నాను మన్నించాలి.