23, ఫిబ్రవరి 2020, ఆదివారం

బ్లాగుల్లో తెలుగుపద్యాలూ అచ్చుతప్పులూ...



కొద్ది రోజుల క్రిందట సాహితీనందనం బ్లాగులో నుతజలపూరితంబులగు నూతులు .. అన్న టపాలో చివరన ఇచ్చిన శతకూపాధిక దీర్ఘిక అన్నపద్యంలో చివరి పాదంలోని గణభంగం గురించి నేను ప్రస్తావించటం పైన కొంత రగడ జరిగింది. చాలా వరకు అది అనవసమైన రగడ.


ఆ టపాలో ఇచ్చిన కందంలో చివరి పాదం శతంబున కెక్కు డొక్క సత్యోక్తి నృపా! అని ఉంది. అలా ఉండి ఉండకూడదు. బహుశః శతకంబున కెక్కుడొక్క అని ఉండి ఉండవచ్చును. కందపద్యాల నడక తెలిసిన వారి కెవరికైనా ఇది ఇట్టే మనస్సుకు తోస్తుంది. పాఠశాలా విద్యార్ధులకైనా గణవిభజన చేస్తే ఇందులో ఉన్న దోషం సులువుగానే బోధ పడుతుంది.

నేను తెలుగుసాహిత్య అకాడమీ వారి (1969సం) భోజరాజీయం పుస్తకాన్ని archive.org  నుండి download చేసి చూసాను. ఆపుస్తకం వివరం 2015.386140.bhoojaraajiiyamu.  ఈ పద్య భాగం తిలకించండి అక్కడెలా గున్నదీ



అందుచేత సాహితీనందనం వారు ఈపద్యాన్ని తమబ్లాగులోనికి ఎక్కించేటప్పుడు చిన్న పొరపాటు దొరలింది అనటంలో సందేహం లేదు.  ఐతే ఈపద్య సంఖ్య ఈప్రతిలో 6-92 కాక 6-84. అంటే బ్లాగు వారు చూచిన అచ్చు ప్రతి వేరే అని తేలుతున్నది. అందులో కాని అచ్చుతప్పు ఉంటే ఉండి ఉండవచ్చును. గణభంగాన్ని సాహితీనందనం వారు గమనించి ఉండకపోవచ్చును.

ఐతే అక్కడ ఒక వ్యాఖ్యాత గారు నా మాటలను ఖండిస్తూ అన్న మాటలు చూడండి.

శతంబునకంటె అని ..మహాకవి పద్యంలో వున్నది.. శ్యామలీయం వారు శతకంబని..సవరణ చేయటం సముచితంకాదు.

చిత్రం. మహాకవి పద్యంలో ఎలా ఉన్నదో ఆ వ్యాఖ్యత చూసారా? మహాకవి స్వయంగా గణభంగం చేసారని వారి ఉద్దేశమా?

ఆ తరువాత రగడ మొదలయ్యింది. ఎవరెవరో అనామకులు నోటికి వచ్చింది మాట్లాడారు!  ఆ తరువాత మొదటి వ్యాఖ్యాత మరింత సూటిగా మరొక వ్యాఖ్య చేస్తూ నావి "కోడిగ్రుడ్డుపై ఈకలు పీకటం లాంటి వ్యాఖ్యలు" అన్నారు. ఇలాంటి అజాగళస్తనసగోత్రులను ప్రక్కన పెడదాం.

కాని ఇంకా ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి. తమ బ్లాగులో అచ్చు తప్పు పడటం గురించి తమ యెఱుక లోనికి వచ్చిన తరువాత కూడా సాహితీ నందనం వారు ఆ పద్యంలోని అచ్చుతప్పును సవరించుకొన లేదు.

అంటే ఏమన్న మాట?  సమాధానాన్ని చదువరులే ఆలోచించుకోవలసి ఉంది.

అదే బ్లాగరు గారి చిత్రకవితా ప్రపంచం బ్లాగులో శివస్తుతి అన్న మొన్న 21వ తారీఖు నాటి టపాలో కూచిమంచి తిమ్మకవి వ్రాసిన రసికజనమనోభిరామం లోనుండి ఒక పద్యాన్నిచ్చారు. అందులో కూడా కొన్ని అచ్చుతప్పులున్నాయి. తప్పులు పట్టటం నా ఉద్యోగం కాదు. నా అభిరుచీ కాదు. కాని అవి కనిపిస్తే ఇబ్బందిగా అనిపించటం నా దౌర్భాగ్యం అనుకోండి. దానికి నేనేమీ చేయలేను. పదేపదే అవే తప్పులు చేసే చోట్లకు పోవటం మానటం తప్ప!

అందుచేత చిత్రకవితా ప్రపంచం వారికి ఈరోజు ఒక వ్యాఖ్యను ఉంచాను. అచ్చుతప్పుల గురించి జాగ్రత వహించమని విన్నవించటానికి ఒక లేఖ అది వ్యాససమగ్రత కోసం ఆ లేఖను ఇక్కడ ఉంచుతున్నాను.

మిత్రులు రమణ రాజు గారు,

దయచేసి పద్యాలను ఛందోదోషాలు లేకుండా ప్రచురించండి. మరీ తరచుగా తప్పుపాఠాలు వస్తున్నాయి.

మీకు లభించిన పద్యపాఠాల్లోనే అచ్చుతప్పులు ఉండవచ్చును. లేదా మీరు బ్లాగులో వాటిని వ్రాస్తున్నప్పుడు తప్పులు పడవచ్చును - వాటిని మీరు సరిచూచుకొని ప్రచురించటం చాలా చాలా అవసరం. పద్యం తప్పులతో కనిపిస్తుంటే మనస్సు విలవిల లాడుతుంది.

పొరపాటును మీదృష్టికి తేవటం అందుకే. కాని అలా చేసినందుకు కొందరు నిరసించటమూ, వెక్కిరించటమూ దూషించటమూ చేస్తున్నారు. బ్లాగులోకంలో అవకాశం చూసుకొని ఇతరులను మాటలనే వారికి కొదవలేదని అందరికీ తెలిసిందే.

మీరు కవిత్వం అనీ సాహిత్యం అనీ బ్లాగులకు పేర్లు పెట్టుకున్నారని, ఏదన్నా విషయం ఉంటుందనీ, నాబోంట్లు మీ బ్లాగులకు రావటం. మంచి చెప్పి మాటలు పడటానికి కాదు. మీరు శ్రద్ధతో సరిగా నిర్వహించని పక్షంలో మీబ్లాగులను విసర్జించక తప్పదు.

ప్రస్తుత పద్యాన్ని మీరు ప్రకటించిన పాఠం చూదాం. ఇది సీసపద్యం. మొదటి పాదంలో ప్రధమార్ధం "రవిశశినేత్ర భువనరక్షణమాత్ర" అని ముద్రించారు. రవి-భువ ప్రాసయతి బాగుంది. రవిశశినేత్ర అన్నప్పుడు అది రెండు ఇంద్రగణాలకు సరిపోవటం లేదు కదా! ఉదాహరణకు రవిశశిశుభనేత్ర అన్నారనుకోండి అప్పుడు సరిపోతున్నది. కాని మూలప్రతిలో ఎలాగున్నదో మరి. అలాగే ""విజితశాత్రవగోత్త" అని పడింది ముద్రారాక్షసం "విజితశాత్రవగోత్ర"కు బదులుగా.

మీరు ఎంచుకొన్న సందర్భాలూ ఉదహరిస్తున్న పద్యాలు బాగుంటున్నాయి. కాని పద్యాలను కొంచెం పరిశీలగా చూచి బ్లాగులో వ్రాయండి. ఒక్కొక్క సారి ముద్రిత ప్రతుల్లోనూ తప్పులుంటాయి. తెలుగు పుస్తకాలు కదా! అందరూ వావిళ్ళ వారిలాగూ పండితపరిష్కరణలూ పండితపరిశీలనలనూ చేసి అచ్చువేయరు. అందుచేత జాగ్రత అవసరం. అలాగే బ్లాగులోనికి ఎక్కించేటప్పుడు రకరకాల కారణాలవలన తప్పులు వస్తాయి. కొంచెం ఓపికగా సరిచేసుకొనకపోతే పాఠకులకు ఇబ్బంది. ముఖ్యంగా సాహిత్యాభిమానులకూ, సాహిత్యవిద్యార్ధులకూ ఆ ఇబ్బంది ఎక్కువ.

ఏదో పద్యం కోసం గాలించటమూ అది ఏదో ఒక బ్లాగులోనో మరొకచోటనో దర్శనం ఇవ్వటమూ నాకే చాలా సార్లు అనుభవం ఐనది. ఐతే ఇంచుమించు ప్రతిసందర్భంలోనూ ఆ పద్యాన్ని అనేకులు తప్పుపాఠంతో ప్రచురించటమూ గమనికకు వచ్చింది. ఉత్సాహానికి వారలను అభినందించవలసిందే ఐనా, నిర్లక్ష్యానికి తప్పుపట్టకుండా ఉండటం సాధ్యం కాదు. ముఖ్యంగా అనేకులు ఇలా వెబ్‍లో కనిపించిని ఏదన్నా సరైన పాఠమే అనుకుంటూ ఉన్నారని తెలిసిన తరువాత. అందుచేత మీకు మరొకసారి విన్నపం చేస్తున్నాను. పద్యాల పట్ల కొంచెం ఎక్కువ శ్రధ్ధ తీసుకొని ప్రకటించండి. అందరికీ ఆనందంగా ఉంటుంది.

మీరు ఈ నా సూచనను పట్టించుకొనకపోతే నేను చేయగలిగినది ఏమీ లేదు. మీ బ్లాగు(ల)కు ఒక నమస్కారం పెట్టి ప్రక్కకు పోవటం తప్ప.

చివరిగా ఒకమాట. ఇలా నేను చెప్పటం అసమంజసం అనో పొగరు అనో వ్యాఖ్యానించే వారికి ఒక నమస్కారం. వారితో వాదనకు దిగేందుకు నాకు ఓపికా తీరికా రెండూ లేవు. (దీన్నే పారిపోవటం అంటారని ఎవరన్నా వ్యాఖ్యానించినా నాకు ఇబ్బంది లేదు. నేను చెప్పవలసింది బాధ్యతగా చెప్పాను. అంతవరకే నా పాత్ర)

ధన్యవాదాలు.


అసలు ఆ పద్యం రసికజనమనోభిరామంలో ఎలా ఉన్నదీ అన్నది చూదాం. ఈ పుస్తకం కూడా నాకు archive.org లో లభించింది. ఆ పుస్తకం వివరం  2015.386499.Rasikajanamamobhiramamu.  అ పుస్తకంలో ఉన్న పద్యం ఇలా ఉంది.



ఈ పై పద్యప్రతి వావిళ్ళ వారి 1910వ సంవత్సరంలో ముద్రించిన రసికజనమనోభిరామము లోనిది. 6వ ఆశ్వాసంలోని 177వ పద్యం. వావిళ్ళవారి పుస్తకాల్లో అచ్చుతప్పులు మహా అరుదు. వారి ప్రచురణలను సాహితీలోకం ప్రామాణికంగా పరిగణిస్తుంది. పైన ఉన్న వావిళ్ళ వారి ముద్రణలో పద్యం రవిశశిశిఖినేత్ర అని మొదలైనది. వావిళ్ళ వారి గురించి తెలియని వారు అక్షేపించితే వారికి వావిళ్ళ వారి గురించి బోదించే తీరిక లేదు నాదు.

ఈ వివరం ఇవ్వకపోతే అత్యుత్సాహం కల వ్యాఖ్యాత  గారు మళ్ళా మరొక మహాకవికే నేను వంకలు పెడుతున్నానని అక్షేపించ గలరు. ఇచ్చినా మరేమని ఆక్షేపిస్తారో తెలియదు - అది వేరే సంగతి.

నేను ఈరోజున వ్యాఖ్యలో చెప్పినట్లు తెలుగుపద్యాలను చాలా మంది అచ్చు తప్పులతో తమతమ సైట్లలో ఉంచుతున్నారు. దీని వలన చాలా అనర్ధం జరుగుతున్నది. ఆ వ్యాఖ్యాత వంటి వారు అవే కవుల అసలు పద్యాలని అనుకొంటున్నారు. ఇది దారుణం.

ఒక పద్యం విషయంలో కష్టేఫలి బ్లాగరు శర్మ గారు కూడా ఇలాగే ఇబ్బంది పడ్దారు. వారి మాటల్లోనే చెప్పాలంటే కొంచెం బధ్ధకించి ఒక భారత పద్యాన్నిఇలాగే నెట్‍లో చూచి తీసుకున్నారు. తీరా చూస్తే అందులో గణదోషాలతో ఉంది సాహిత్యం. వారికి మనవి చేస్తే చూసి అప్పుడు భారతం తిరుగవేసి అసలు పాఠాన్ని తమ టపాలో ఉంచారు.

ఆ పద్యం నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె.. అన్న నన్నపార్యుని పద్యమే. అది నాకు వేరొక చోట అంటేసాహితీనందనం బ్లాగులో కనిపించింది కాని అక్కడా కొన్ని తప్పులతోనే ఉంది. గరికపాటివారి సైట్‍లో కూడా కొంచెం తప్పుగానే ఉంది. తెలుగువికీ పేజీలో కూడా ఒకతప్పుతో ఉంది. ఇలా చాలా చోట్ల చిన్నాచితకా తప్పులతోనే ఉన్నది. ఈ విషయం మనవి చేయటమూ శర్మ గారు నేరుగా భారతాన్ని సంప్రదించటమూ చేసారు. ఈ సంఘటన గన సంవత్సరం డిసెంబరులో జరిగింది.

అదుచేత అందరు బ్లాగర్లకూ నా సవినయమైన విన్నపం యేమిటంటే దయచేసి ఇతరులను ఉటంకించేటప్పుడు, ముఖ్యంగా కవుల పద్యాలను తమ టపాల్లో ఉంచేటప్పుడు తగిన జాగ్రతలు తీసుకొన వలసింది. అలా చేయటం వలన పాఠకులకూ ఆకవులకూ కూడా న్యాయం చేసిన వారు అవుతారు.