26, ఫిబ్రవరి 2020, బుధవారం

ఎందు చూచిన మోసమె జనులార


ఎందు చూచిన మోసమె జనులార అకట యెందు చూచిన దోసమె

అందరును కలివిషాక్తమైన యన్నమే భుజియించు చుండగ



అరయ నెనుబది నాల్గులక్షల పరమచిత్రము లైన జీవుల

హరికుమారుడు సృష్టి చేసెను నరుల మిన్నగ నిర్ణయించెను

నరుల కిచ్చెను స్వేఛ్చ తమకు నచ్చినట్లుగ బ్రతుకు గడుపగ

హరిహరీ యపుడేమి జరిగెను నరులు క్రమముగ దారితప్పిరి



ఏల దారిని తప్పిరంటే యేమి చెప్పగ వచ్చునయ్యా

కాలమా కలియుగము కలికి జాలి గీలీ యేమి గలదు

నేలపై గల నరుల బుధ్ధుల నీచమార్గము లందు నడపును

మేలు కీడుగ కీడు మేలుగ మెదలగా జనహృదయములలో



తప్పుచేసెడు తల్లిదండ్రులు తనయులను దండించుచుందురు

తప్పుదారిన బడిన కొడుకులు తల్లిదండ్రుల జంపుచుందురు

తప్పునొప్పును తెలియనేరక తరచు మిత్రుల మోసపుత్తురు

తప్పుడు భర్తలును భార్యలు దారుణంబులు సేయుచుందురు



అక్కడక్కడ విష్ణుభక్తులు నక్కజంబుగ మొలచుచుందురు

మొక్కవోని ధైర్యమూని చక్కగా హరి సేవనుందురు

నిక్కముగ శ్రీరామనామము నెక్కుడుగ ద్యానించుచుందురు

తక్కిన జను లెల్ల మాయదారి బ్రతుకుల నీడ్చుచుందురు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.