8, ఫిబ్రవరి 2020, శనివారం

మా దైవమా రామ భూపాలుడా నీవు మామాట లాలించి మమ్మేలరా


మా దైవమా రామ భూపాలుడా నీవు
    మామాట లాలించి మమ్మేలరా
అదుకొమ్మని వేరు దైవముల మే
    మడుగమురా హరి మమ్మేలరా

నీయానతిని గొని నిలిచెదము మేము
    నీపూజ మానక చేసెదము
నీయందు చిత్తము నిలిపెదము మేము
    నీనామ స్మరణమె చేసెదము
నీయందచందము లెన్నెదము మేము
    నీపాదయుగళమె పట్టెదము
నీయున్నతిని గూర్చి పాడెదము
    మేము నీభక్త కోటిని చేరెదము

భువనేశుడ వని నమ్మెదము మేముక
    నీపైన కవితల నల్లెదము
పవలురేలును నిన్ను తలచెదము మేము
    బాగొప్ప నినుజేర తలచెదము
అవిరళము నీకృప నడిగెదము మేము
    అపవర్గ మొకటే యడిగెదము
భవబంధములు బాప వేడెదము మేము
    పతితపావన నిన్ను వేడెదము

నిను మెచ్చు వారిని పొగడెదము మేము
    నిను తిట్టు వారిని తెగడెదము
అనయము నిన్నే కొలిచెదము మేము
    వినయము కలిగి నిలచెదము
అణువణువున నిను చూచెదము మేము
    అందరిలో నిను చూచెదము
వనజాక్ష నీవే చాలందుము మేము
    వినతాసుతవాహ నీవారము

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.