11, ఫిబ్రవరి 2020, మంగళవారం

శ్రీరామ సీతారామ శ్రీరఘురామ


శ్రీరామ సీతారామ శ్రీరఘురామ
నారాయణ వినుమన్న నా యీమాట

సేవింపగ సేవింపగ స్థిరముగ నిన్ను
శ్రీవల్లభ బుధ్ధియె దుశ్చింతలు మానె
ఈవంకకు నావంకకు పోవుట లుడిగి
నీవంకకు తిరిగి తాను నిలచిపోయెను

చింతింపగ చింతింపగ శ్రీహరి నిన్ను
చింతలన్ని పారిపోయె చిత్తము నుండి
ఇంతింతై యంతంతై ఈహరి భజన
అంతులేక సాగుచుండె అహర్నిశలును

చేయగా చేయగా హాయిగ భజన
మాయ నన్ను వదలి తానె మరలిపోయె
నీ యపార మైన కృపకు నేను నోచితి
ఆ యపవర్గంబు నిచ్చి యాదరించవె