18, ఫిబ్రవరి 2020, మంగళవారం

ఇన్నా యన్నా యెత్తిన జన్మము లెన్నని చెప్పేది


ఇన్నా యన్నా యెత్తిన జన్మము లెన్నని చెప్పేది

యెన్నెన్నెత్తుదు నికమీదట నని యెట్లా చెప్పేది



దాగుట శక్యమె ప్రారబ్ధంబది తరుమగ జీవునకు

మూగక మానవు కష్టము లన్నవి పుట్టిన పిమ్మటను

నే గడచితి నటువంటి పుట్టువులు నిశ్చయముగ కోట్లు

రాగల జన్మల వివరము లన్నీ రామునకే యెఱుక



భోగలాలసను కరిగిపోయినవి పుట్టువు లెన్నెన్నో

రోగము రొష్టుల ననుభవించుచు సాగిన వెన్నెన్నో

యోగాభ్యాసము మొదలై నప్పటి నుండి యిదెన్నవదో

యే గురుతులు నాకున్న విప్పుడని యేమని చెప్పేది



ఏ సత్కర్మఫలానుభవంబది యిప్పుడు కల్గినదో

భాసమానమై రామనామము పండినదీ బ్రతుకు

చేసెద నిష్ఠగ రామనామమును చిత్తశుధ్ధి తోడ

దాసుడ రాముని కృపగల్గినచో తరియింతును నేను

1 కామెంట్‌:

  1. ఇటీవల వెలువడిన గీతాలు ఒకదానిని మించి మరొకటి అబ్బురపరిచే భావనలతో ఉన్నాయి.

    రామ భక్తి అన్ని గీతాలలోనూ ప్రతిపాదిత విషయమే అయినా, ఒక్కో గీతం లోని వైవిధ్యం గొప్పగా ఉన్నది.

    అన్నమయ్య తన కీర్తనలలో స్పృశించని పార్శ్వం లేదు, ఆ సొగసు అనితర సాధ్యం అని పెద్దలు ఏకకంఠం తో నిర్ణయించారు.

    ఇప్పటి కాలం లో ఇంత వైవిధ్యంతో సొగసుతో భక్తి తో కూడిన భావనలు మీరు రచించిన గీతాలలో ఎన్నో ఉన్నాయి అని చెప్పడానికి సందేహించను. అది భావములోన బాహ్యము నందున మీపై కలిగిన అన్నమయ్య ఆశీర్వాదం శ్రీరాముని అనుగ్రహం అని భావిస్తున్నాను.

    ఇది పొగడ్త కాదు నా మనసులో మాట.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.