11, ఫిబ్రవరి 2020, మంగళవారం

రారే జనులార రాముని భజనకు మీ రెల్ల రుత్సాహ పూరితులై


రారే జనులార రాముని భజనకు
మీ రెల్ల రుత్సాహ పూరితులై

ఉదితం బైన శ్రధ్ధయె లోన నుత్సాహ ముప్పొంగ జేయగను
నిదురను మాని ప్రతినను బూని నీరజాక్షుని దివ్యభజనకు
సదయుని పైన మధురము లైన చక్కని కీర్తనలను పాడ
కదలి రారే కదిలి రారే కల్యాణరాముని భజనకు

కామము నణచి క్రోధము నణచి కాపాడు రాముని భజనకు
సామాన్యులైన శ్రీమంతు లైన శ్యామసుందరుని భజనకు
మోమాట పడక గర్వించి చెడక ముదమార భజన చేయగను
పామరు లారా పండితు లారా పరుగున రారేల భజనకు

ఇనకులపతియై కువలయపతియై యెసగెడు రాముని భజనకు
తనయుల గూడి తండ్రుల గూడి దయచేయుడీ రామభజనకు
మనసార పాడి రాముని వేడి మైమరచి యాడ భజనకు
జనులార రారే సరగున రారే జానకీ రాముని భజనకు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.