14, ఫిబ్రవరి 2020, శుక్రవారం

హాయిగా శ్రీరామ భజన చేయరే సదా మాయదారి గొడవలన్ని మాని చక్కగా


హాయిగా శ్రీరామ భజన చేయరే సదా
మాయదారి గొడవలన్ని మాని చక్కగా

హృదయమునకు రామభజన మెంత చేసినా
ముద మతిశయించు గాక మొగము మొత్తునా
వదలక విషయముల వెంట పరువు లెత్తిన
తుద కవి మిము ముంచకుండ వదిలిపెట్టునా

హరి దయతో దొరకె గదా నరుని వేషము
సిరులు సంపదలను గూర్చి చింత దేనికి
అరచేతను కాసులేక నరుగుదెంచినా
హరిభక్తుల వరియించవె సిరులు స్వయముగ

రామభక్తి ధనము కన్న భూమి నెంచగ
నేమి ధనము కలదు గాన నెల్లవేళల
రామ రామ సీతారామ రఘుకులేశ్వర
స్వామి మాంపాహి యనుచు భజన చేయరే

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.