13, ఫిబ్రవరి 2020, గురువారం

అంతంత మాత్రపు టింతంత మాత్రపు టానందము లవి యెందుకయా


అంతంత మాత్రపు టింతంత మాత్రపు టానందము లవి యెందుకయా
అంతులేని యానందము నిచ్చే హరిభజనము మా కున్నదయా

మనోహరుని మా రామచంద్రుని మనసును తలచుట ఆనందం
అనాథనాథుని యనుపమదయనే యనిశము తలచుట ఆనందం
జననాయకుని జానకిరాముని చక్కగ పొగడుట ఆనందం
పనిగొని రాముని భక్తుల గూడుక భజనలు చేయుట ఆనందం

నారాయణ హరి వామన శ్రీధర నారామా యను టానందం
నారసింహ హరి కేశవ మాధవ నా స్వామీ యను టానందం
శ్రీరామా హరి చింతితార్ధప్రద సీతాపతి యను టానందం
మారజనక హరి మంగళదాయక మా రాఘవ యను టానందం

నారాయణస్తవ మానందం హరి నామభజన పరమానందం
శ్రీరామార్చన మానందం హరి చింతనమే పరమానందం
ఔరౌరా యిటు లానందము హరి యచ్యుతు దయచే నబ్బగను
వేరుగ చెప్పగ నేమిటి కయ్యా విషయానందము లెందుకని

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.