15, ఫిబ్రవరి 2020, శనివారం

పరబ్రహ్మమే రామభద్రుడై రాగా పరమభక్తు లిదె వచ్చిరి బ్రహ్మాదులు


పరబ్రహ్మమే రామభద్రుడై రాగా
పరమభక్తు లిదె వచ్చిరి బ్రహ్మాదులు

పరమేష్ఠి మున్నె జాంబవంతుండై యుండెను
హరిసేవకు డగుచు నిలువ ధరాతలమున
పరమశివుడు తాను గాలిపట్టియై జనియించె
పరమరామభక్తు డగుచు పరవశింపగ

దేవశిల్పివిశ్వకర్మ తేజరిల్లె నలుడై
దేవవైద్యులైరి మైందద్వివిద వీరులు
దేవగురుడు తారు డగుచు దిగివచ్చెను ధరణికి
వేవెలుంగు సుగ్రీవ కపీంద్రుడాయెను

ధనేశుడును గంధమాదనుడుగా నరుదెంచె
జనియించెను సుషేణుడై ఘనుడు వరుణుడు
జననమందె పర్జన్యుడు శరభుడను వీరుడై
అనవద్యులు వీరందరు హరికి తోడైరి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.