17, ఫిబ్రవరి 2020, సోమవారం

కోరిచేరితి మిదే కోదండరామ


కోరి చేరితి మిదే కోదండరామ

కారుణ్యధామ మమ్ము కటాక్షించవే



మేలగు కుటుంబమును మేలగు ప్రాభవమును

మేలగు శీలంబును మేలైన చేతలును

మేలెంచు బంధువుల మేలుచేయు మిత్రులను

వాలాయగముగ మాకు ప్రసాదించవే



జయము మంచిపేరును చక్కని సంపదలును

క్రియాకుశలబుద్ధియు దయగల చిత్తంబును

భయములేని బ్రతుకును బహుసుఖజీవనమును

దయచేయుమా మాకు దశరథాత్మజ



పలుకున నీనామము కులుకెడు నాలుకయును

కులుకుచు నీరూపము తలచెడు చిత్తంబును

తలపుల నీతత్త్వము తళుకొత్తు భాగ్యమును

వలయును తండ్రి మాకు వలదన కీవే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.