21, ఫిబ్రవరి 2018, బుధవారం

ఏమేమో అడుగువాడ నేమాత్రము కాను

ఏమేమో యడుగువాడ నేమాత్రము గాను శ్రీ
రామ నీ సాన్నిధ్యమె నా మనోరథము

శ్రీమంతుడ వీవని సీతమ్మ పతి వని
కామితార్థప్రదుడ వని కరుణాసముద్రుడ వని
యేమేమో విన్నాను యెంతో పరవశించాను
నా మొఱాలకించి నీవు న న్నేలుకొన వలయు

ఏమో నే నిప్పటికే యెన్ని జన్మ లెత్తితి నో
స్వామీ యికమీద నెన్ని జన్మ లెత్తు వాడనో
యే మాత్రము సుఖములేని యీ జన్మ లెందుకు
నా మీద దయయుంచి న న్నేలుకొన వలయు

శరణమనుచు నెట్టివాడు చరణంబులు పట్టిన
దరిజేర్చు నట్టి గొప్ప ధర్మప్రభు డనగ నీవు
నిరుమానకృపారాశి నీవాడ నైతి నింక
పరమాత్మ నీ సన్నిధి వరముగా నీ వలయు