14, జనవరి 2018, ఆదివారం

భ్రమలన్ని విడచిన ఈ‌చిత్తము నిన్ను చెందినది


కమలాప్తకుల సంభవ చిత్తము నిన్ను చెందినది
భ్రమలన్ని విడచిన ఈ‌చిత్తము నిన్ను చెందినది

బహుమార్గముల సాగి బడలిన నా చిత్తము
బహుదేహముల గడపి  బడలిన నా చిత్తము
బహుకష్టములు దాటి బడిలిన నా చిత్తము
మహనీయ రఘురామ మరి నిన్ను చెందినది

నేలపై తిరిగి డస్సి నిలచి నా చిత్తము
కాలపు మాయలకు కనలి నా చిత్తము
తాలుతప్ప బ్రతుకుల తేలి నా చిత్తము
వాలాయముగ రామభ్రద్ర నిన్ను చెందినది

అన్ని నీవే నని యన్నది నా చిత్తము
పన్నుగ నిను నమ్మి యున్నది నా చిత్తము
ఎన్న డిక నల్పముల నెన్నదు నా చిత్తము
తిన్నగ శ్రీరామదేవ నిను చెందినది


1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.