2, జనవరి 2018, మంగళవారం

కాలాష్టకం


నీవు చేయని గారడీ నేలమీద
లేదు ముమ్మాటికిని లేదులేదు నిజము
నేల మీదేమి సకలలోకాల లేదు
కాలమా నీకు నా నమస్కారశతము  ౧

క్షణము నిముషమ్ము కళయు కాష్టయును నీవ
యహము వారము పక్షమాయనము నీవ
వత్సరంబును యుగము కల్పమును నీవ
కాలమా నీకు నా నమస్కారశతము ౨

సర్వమును నీవు కలిగించి నిర్వహించి
మరల లోగొందు వొకలీల మరలమరల
కడలి నలయంత సహజ మీ కలన యనగ
కాలమా నీకు నా నమస్కారశతము ౩

సృష్టికర్తవు నీవుండ సృష్టికర్త
లన నెగడి యెందరెందరో యడగినార
లింక నాబోటి జీవుల కేమి లెక్క
కాలమా నీకు నా నమస్కారశతము ౪

భయము దేనికి నీదైన పరమసహజ
దివ్యఖేలన మిట్లని తెలిసికొంటి
ఆట లోపల నాదొక్క పూట పాత్ర
కాలమా నీకు నా నమస్కారశతము ౫

నీవు కలిగించు జీవనిర్జీవకోటి
నేల చేయుదు వూహింప నెవరు శక్తు
లెట్లు చేయుదు వది మాత్ర మెవరి కెఱుక
కాలమా నీకు నా నమస్కారశతము ౬

పరమ దుర్జయ శక్తివై పరగు దీవు
పరమ దుర్ఞేయ శక్తివై వరలు దీవు
నిరుపమానవిధానవై నెగడె దీవు
కాలమా నీకు నా నమస్కారశతము ౭

దైవమన నీవె గాన నీదైన రీతి
తలచి సకలశుభాశుభములను నీదు
చిద్విలాసంబులని యెంచి చేయువాడ
కాలమా నీకు నా నమస్కారశతము ౮

కాలాష్టక మిది చదివిన
కాలంబున జేసి కలుగు కష్టసుఖములన్
తేలెడు మనుజులు స్థితప్ర
జ్ఞాలంకృతబుధ్ధు లగుచు సాగెద రిలపై