16, నవంబర్ 2017, గురువారం

పై కెగిరి లంకపైన పడిన తోకచిచ్చా


పై కెగిరి లంకపైన పడిన తోకచిచ్చా
నీ‌కు నీవె సాటి సుమా నిజము తోకచిచ్చా

లంక జేరి సీత నరసి జంక కెల్ల వనము జెరచి
మంకు రాకాసిమూక మానముడిపి నిలిచి
లంకేశుని సభకు చేరి గొంకక రాముని పొగడి
అంకిలిపాటోర్చి నట్టి హనుమన్న తోకచిచ్చా

విడచి ధర్మపరుండైన విభీషణునుని మందిరము
విడువక పురమెల్ల కాల్చి విడచితివి బూదికుప్ప
నిగుడ కీల లతిశయించి నింగిముట్ట సంబరము
వగకారితనము మీఱు పవనజుని తోకచిచ్చా

సీతమ్మ కోర చందన శీతలమై యుండు నట్లు
వీతిహోత్రు డొనరించిన వేడ్కగొన్న తోకచిచ్చా
భూతలమున రామబంటు భూరిశక్తి చాటిన
వాతాత్మజు కీర్తికే పతాకమైన తోకచిచ్చా