12, నవంబర్ 2017, ఆదివారం

వీడెవ్వడయ్యా యన్న వీడు వట్టి పిచ్చివాడు



వీడెవ్వడయ్యా యన్న వీడు వట్టి పిచ్చివాడు
వేడుకతో కావదగిన వాడు శ్రీరామచంద్ర

పడవలసిన పాట్లు గలవు పుడమి వ్రాలినాడు
కుడువదగిన కర్మఫలము కుడువవచ్చినాడు
దుడుకుపనులు తొల్లి చేసి తొడరి వచ్చినాడు
విడువలేక నైజ మెల్లవిధములను చెడినాడు

కల్లమాటలాడ బోను కానివేమి చేయబోను
నల్లనయ్య రక్షించుమని తల్లడిల్లినాడు వీడు
తల్లిపొట్ట నుండి కోటి దండములే పెట్టినాడు
చెల్లబో ప్రకృతిమాయ చేత నిదే చిక్కినాడు

వీడు తనంతతానై విడుచుటేడ ప్రకృతి నింక
వీడు నిన్నెఱుగుటేడ వీఱిడియై యున్నాడు
వీడు నిన్ను వేడుటేడ వీడు నిన్ను చేరుటేడ
వీడి బాధలడచ వయ్య వేరు దిక్కులేదు సూవె


2 కామెంట్‌లు:

  1. "వీడు నిన్నెఱుగుటేడ వీఱిడియై యున్నాడు"

    దీనికి పదవిభజన చేసి కొంచెం అర్ధం వివరిస్తారా?
    ముఖ్యంగా "వీఱిడియై" అనే పదం నాకు తెలియనిది.,ఇగిమ చరనాలన్నీ బాగున్నాయి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిక్కనగారి ద్రౌపది శ్రీకృష్ణపరమాత్మ రాయబారానికి హస్తినకు పోతున్న సందర్భంలో ఆయన ఉద్దేశించి ఒక పెద్ద ఉపన్యాసం చేస్తుంది. అందులో ఒక చోట "వీఱిడి యైన మానిసికి వెండి వివేకము కల్గ నేర్చునే" అంటుంది. ఇక్కడ వీఱిడి అంటే వివేకం కోల్పోయిన వ్యక్తి అని అర్థం. అలాగే వెండి అంటే వెండో బంగారమో కాదిక్కడ - వెండి అంటే తిరిగి అని అర్థం!

      మీరు చూపిన చరణపాదం భావం ఏమిటంటే వీడు నిన్ను తెలుసుకొనుట ఎక్కడ? తాను (ప్రకృతిమాయ వలన భ్రాంతచిత్తుడై) వివేకం కోల్పోయి ఉన్నాడు కదా అని.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.