12, నవంబర్ 2017, ఆదివారం

ఏమిటయ్యా వీ డిచ్చట చేసేది


ఏమిటయ్యా వీ డిచ్చట చేసేది
యేమంత ఘనకార్య మెవ్వడెరుగనిది

వచ్చుట పోవుట వచ్చిపోయెడు వారి
గ్రుచ్చిగ్రుచ్చి చూచుట కొఱకొఱలాడుట
నచ్చినవారితో ముచ్చటలాడుట
అచ్చముగ నింతెగాక నధికం బేమి

అందినవాటితో నానందపడలేక
నందనివాటికై యఱ్ఱులు జాచుట
తొందరించ నాశలు చిందులు త్రొక్కుట
వందమాట లేల వీడి బ్రతుకింతేలే

రామతత్త్వమున బుధ్ధి రమియింపదాయె
రామనామమా నోట రవళించదాయె
కాముని విడచి వీడు రాముని చేరుదాక
ఏమి చేసి యేమి లాభ మేది ముక్తి వీడికి