11, నవంబర్ 2017, శనివారం

రామ రామ యను మాట రాదేమో నానోట


రామ రామ యను మాట రాదేమో నానోట
ఏమో ఆ కాలుడు నా కెదురుపడిన పూట

ఏమో ఏమేమో యగుచు నెంత కలత పడుదునో
ఏమీ యీ బంధుమిత్రు లేమైరని వగచెదనో
ఏమాత్రము దయలేని ఆ మొరటువాని గని
రామ రామ యనుదునో  యేమి పలికి చెడుదునో

తర్జని నాపైపు బరపు తరలుమనే వాని గని
గర్జించే వాని ముందు గర్వోక్తులు పనికి రాక
ఆర్జించిన ధనములిచ్చి ఆ యముని  కొన లేక
ధూర్జటినుత రామ నీవు తోచక నా మనసులో

విడువక నీ నామమునే వివిధవేదాంత వేద్య
అడియాసలు విడచి నే నుడివెద నను నిత్యము
గడచెద సంసారము కాని యెడల సంశయమే
వెడలువేళ నీ నామము వెడలుట నా నోట


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.